Smita Sabharwal: ప్రభుత్వాలు మారగానే అటవీ పరిరక్షణ..వన్యప్రాణుల పరిరక్షణ పట్ల ఆ ఐఏఎస్ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు ? అని సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను ఉద్దేశించి పెట్టి పోస్టు హాట్ టాపిక్ గా మారింది. అధికార మార్పిడి జరిగితే చట్టాల పట్ల ఐఏఎస్ ల అభిప్రాయాలూ మారొచ్చా? అని అయోధ్యరెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ హాయంలో ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవో లో ఇరిగేషన్ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. ఇప్పుడు గచ్చిబౌలి భూముల వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలో మర్మం ఏందో ? అని నిలదీశారు. అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా ? అని అయోధ్యరెడ్డి సూటిగానే స్మితాసబర్వాల్ ను ప్రశ్నించారు. ఆనాడు కాళేళ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 25లక్షల చెట్లను తొలగించడంలో అటవీ, వన్యప్రాణుల చట్టాల ఉల్లంఘనపై మీడియాలో వచ్చిన కథనాలను అయోధ్యరెడ్డి పోస్టు చేశారు.
స్మితా వర్సెస్ అయోధ్యరెడ్డి ట్వీట్ వార్
సీఎం చీఫ్ పీఆర్వోగా ఉన్న అయోధ్యరెడ్డి నేరుగా తెలంగాణ టూరిజం కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. అంతకుముందే గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ పోస్టు చేసిన వ్యవహారంలో పోలీసుల నోటీస్ లపై స్పందించి స్మితా సబర్వాల్ హాయ్ హైదరాబాద్ ఏఐ ఇమేజ్ పోస్టును 2వేల మంది రీట్వీట్ చేశారని..వారందరిపై చర్యలుంటాయా..? అని ప్రశ్నించారు. కొంతమందిని సెలెక్ట్ చేసి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని.. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టారు. స్మితా ట్వీట్ కు కౌంటర్ గా అయోధ్యరెడ్డి ఆమె వైఖరిని ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్ ఈ వివాదంలో మరింత వేడి రగిలించింది. స్మితా వర్సెస్ అయోధ్యరెడ్డి ట్వీట్ వార్ ను ప్రభుత్వం వర్సెస్ స్మితా సబర్వాల్ గానే చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే సీఎం చీఫ్ పీఆర్వోగా ఉన్న అయోధ్యరెడ్డి అభిప్రాయం దాదాపుగా సీఎం లేదా ప్రభుత్వ అభిప్రాయంగానే భావించాల్సి ఉంటుందంటున్నారు.