ఉన్నమాట: ” కేవలం ఒక్క ఓటు కోసం మనం అధికారాన్ని వదులుకోవాల్సిన అవసరం ఏమున్నది ? మీరు సరేనంటే మనకు ఎంత మంది మద్దతు ఇస్తారో మేం చూపిస్తామని మా వాళ్లు కొందరు నాతో చెప్పారు. నేను వద్దన్నాను. సమర్థుడు ఎప్పుడూ అడ్డదారులు తొక్కడు అని తెగేసి చెప్పా ! ఇప్పుడు నేను తప్పుకుంటున్నా ! జనం కోరుకుంటే మళ్లీ వస్తా !” – ఒక్క ఓటు తేడాతో ఓడి అధికారాన్ని వదులుకునే ముందు అటల్ బిహారీ వాజపేయి చెప్పిన మాటలివి.
బీజేపీ ఎలాంటి పార్టీనో, ఎలాంటి విలువలతో అధికార రాజకీయాల్లోకి అడుగు పెట్టిందో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్. మైలురాయి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయ్. ఆ విలువల వలువలు ఊడిపోయాయ్. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అనే అర్థం కూడా మారి, బజార్ జంతర్ మంతర్ పార్టీ అయిపోయింది. దేశంలో వ్యవస్థల్ని, జనం బతుకుల్ని, భవిష్యత్తునీ టోకున బజారున పడేస్తోంది. ఇది నేటి నిజం.
అధికారం మీద యావ తప్ప అవగాహన లేనివాళ్లు, ఏం చదివారో కూడా చెప్పుకోలేని అబద్ధాలకోర్లు, స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ నుంచి నేరుగా రాజకీయాల్లోకి దిగి వందల కోట్ల చొప్పున లెక్క కట్టి ఎమ్మెల్యేలను కమోడిటీలా కొనేయొచ్చు అనుకునే రాజకీయ బేరగాళ్ల చేతుల్లో దేశ డమొక్రసీ విలవిల్లాడుతోంది. విడుదల కోరుకుంటోందన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం.
ఎవరికైనా తేడా చేస్తే జబ్బు చేసిందంటాం. బీజేపీకి మాత్రం డబ్బు చేసింది. అధికారంలోకి రావాలంటే డబ్బు, రాష్ట్ర ప్రభుత్వాల్ని కుప్ప కూల్చడానికి డబ్బు, ఎమ్మెల్యేలను కొని ఫిరాయింపుల్ని ఉసిగొల్పడానికి డబ్బు, సొంత రాజకీయ అజెండా అడ్డగోలుగా అమలు చేయడానికి డబ్బు, బెయిలు మీదున్న నాయకుల్ని జైల్లోకి పోకుండా కాపాడేందుకు డబ్బు… ఇలా ప్రతీ బేరానికి లెక్క కట్టి నోట్ల కట్టలతో ఓట్ల లెక్కల్ని శాసించాలన్నది బీజేపీ భావజాలం ఇవాళ ! తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలకు వందేసి కోట్ల చొప్పున నాలుగు వందల కోట్లు. ఆ కాల్ రికార్డుల్లో చెప్పినట్టు నంబర్ వన్, నంబర్ టుల సర్వీస్ ఛార్జీలతో కలిపితే ప్లానింగ్ ఇంకెంత రేంజులో ఉంటుందో తెలియదు.
బీజేపీ అంటే ఒకప్పుడు పొర్ఫామెన్స్ పార్టీ ! వాజపేయి కాలంలో, 23 పార్టీలను ఒక్కటిగా నడిపిస్తూ … దేశ నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించడం వల్ల ఆ పేరొచ్చింది. అందుకే ఆ పార్టీ అంటే మధ్య తరగతికి అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్‌ను కూడా హడల్ కొట్టేసే బాదుడు, చేతగాని పరిపాలనకు తోడు అడ్డగోలుగా డబ్బు వెదజల్లితే అధికారం అందుతుందనుకునే అహంకారం దేశ భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తోంది.
సంకీర్ణ తలనొప్పులు లేకుండా, ఫుల్ ఫోర్స్ మెజారిటీ చేతిలో పెడితే… ఏం చేశారు ? దేశానికి ఏమిచ్చారు – అంటే ఎనిమిదేళ్ల లెక్క చాలా పొడుగే ఉంటుంది. 9 రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చిన ఘనత… దేశవ్యాప్తంగా 267 మంది ఎమ్మెల్యేలను డబ్బులు పోసి కొన్న చరిత్ర… త్రిపుర లాంటి ఈశాన్య హిల్ స్టేట్ లో కూడా ఓటు రేటు రెండు వేలకు పెంచిన డబ్బు బలుపు మాత్రమే కనిపిస్తున్నది. మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చిన 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం 1900 కోట్లు ఖర్చు పెట్టారన్నది బీజేపీ ఇంటర్నల్ లెక్క. ఉప ఎన్నికల పంపకాల ఖర్చు అదనం. కర్ణాటకలో కుమార స్వామిని కుప్ప కూల్చేందుకు 16 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ఇచ్చిన ప్యాకేజీ 1320 కోట్లు అనే సంభాషణ బెంగళూరుకి తెలుసు.
మహారాష్ట్రలో ఓ పార్టీ గొంతు నులిమేసేందుకు, తిరుగుబాటు ముఠాను తయారు చేసేందుకు అయిన ఖర్చు 2,500 కోట్లని తెలిసి సొంత పార్టీ నేతలు నిర్ఖాంతపోయి, అభ్యంతర పెట్టినందుకు పార్టీ పదవులు ఊడగొట్టు కోవడం నిన్నమొన్నటి నిజం. ఇది ఎనిమిదేళ్ల చరిత్ర మాత్రమే కాదు. ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఆల్ టైమ్ వరస్ట్ రికార్డు కూడా ! ఎందుకంటే ఇందిర హయాంలో కూడా ఇంతలా రాష్ట్ర ప్రభుత్వాల్ని కారాడిన దాఖలా లేదు. నేరుగా సూటు కేసులతో రంగంలోకి దిగి ఎమ్మెల్యేలను కొనేందుకు తెగబడిన ఉదంతాలు కనపడవు.
తెలంగాణలో ఇన్ స్టంట్ ఎత్తుగడలతో ఎమ్మెల్యేలను కొనేస్తామంటారు. రాజకీయం కోసం 18 వేల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చేసి ఉప ఎన్నికలు పుట్టిస్తారు. అదే ఏపీలో అయితే అడ్డగోలు అప్పులు ఇప్పిస్తూ పర్సంటేజీలతో పబ్బం గడుపుతారు. మూడురన్నరేళ్లుగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా – ఏపీలో ఉన్న ఉడత, భక్తితో కనీసం 600 కోట్ల చొప్పున సమర్పిస్తోందన్నది జుబ్బా, పైజామాలు జబ్బలు చరిచి మరీ చెబుతున్న మాట. ఇదొక్కటే కాదు. ప్రతీ దానికీ ఓ రేటు ఉన్నది.
ఇప్పటికే రుణ పరిమితి ముగిసినా ఏపీ సర్కారుకు అడ్డగోలు మార్గాల్లో అప్పులు ఇప్పించడానికో రేటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఫండ్ కలెక్షన్ కోసం ఓ రేటు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టులు – పథకాల సొమ్ము దారిమళ్లించినా నోరు మెదపకుండా ఉండేందుకు ఓ రేటు… నిలువెత్తు కేసులు, 46 వేల కోట్ల అటాచ్ మెంట్లూ ఉన్నా.. రాజకీయ క్రిమినల్ కేసుల్ని తేల్చి – శిక్షలు పడేలా చేస్తామన్న హామీని తుంగలో తొక్కేందుకు ఓ రేటు … ఇలా కమలం కేటలాగ్ పొడవు చాలానే ఉంది. ఇక లోకల్ గా ఏ హంగూ లేకపోయినా, కక్కుర్తి రారాజు వీరావేశంతో చేసే వసూళ్లకైతే సెపరేట్ ఆడిటింగ్ చేయాలి. పట్టుమని వెయ్యి మంది కూడా రాని ప్రోగ్రాములకి కూడా రెండున్నర కోట్ల లెక్క చూపించే సోములు, సాములకు లెక్కే లేదు బీజేపీలో !
అంటే, సింపుల్‌గా చెప్పాలంటే కుదిరితే కొనుక్కోవడం, కుదరకపోతే కుమ్మక్కు కావడం.. ఇదే బీజేపీ రాజకీయం. పోనీ ఇంతింత సొమ్ములు కుమ్మరిస్తున్నారు కదా, అభివృద్ధి విషయంలోనూ అలాంటి దూకుడే ఉందా అంటే లేనే లేదు. అంతా దిగదుడుపు. ఎనిమిదేళ్లలో తెచ్చిన భారీ ఇన్వెస్ట్మెంట్ గానీ, ప్రొడక్షన్ సెక్టర్‌లో పెట్టిన కనీస పెట్టుబడి గానీ, నెలకొల్పిన వ్యవస్థగానీ ఏదైనా ఉందేమో చెప్పమనండి. ఏదీ లేదు. శూన్యం. చైనాను ఎదుర్కోవడం అంటే టిక్ టాక్‌ని బేన్ చేయడం, రాజకీయంగా బలపడటం అంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవడం – అన్నట్టే ఉంది బీజేపీ పనితనం. పిటీ !
ఇదంతా చూశాక ఒళ్లు గగుర్పొడిచే విషయం ఒకటి తట్టక మానదు. త్వరలో 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని నంబర్ టు భువనగిరి సభలో ప్రకటించిన రెండు వారాల్లోనే నలుగురు ఎమ్మెల్యేలు – నాలుగు వందల కోట్ల కథ బయటపడింది. ఈ లెక్కన దేశ రాజకీయాన్ని అడ్డగోలుగా కొనేయడం పెద్ద లెక్కేం కాదా ! అలాగే అనుకోవాలా ? దేశం మొత్తంమ్మీద, అన్ని రాష్ట్రాల్లోనూ కాస్త అటు ఇటుగా 4300 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అందులో 2500 మంది ఉంటే అన్ని చోట్లా అధికారం ఖాయం.
ఆల్రెడీ అదిరించో బెదిరించో గెలిచే సీట్లు పోనూ ఇక కొనుక్కోవాల్సినవి ఓ వెయ్యో 1500 వందలో ఉన్నాయనుకోండి – టోకున కొనేసేందుకు బీజేపీ తెగబడదు అనే గ్యారెంటీ ఏముంది ? ఒక్కో రాష్ట్రాన్నీ కబళించడం కన్నా, ఒకే సారి మింగేసే ఎత్తుగడ సిద్ధం చేయొచ్చునేమో 2024 తర్వాత ! భయానక ఆలోచనలు చేసే బీజేపీ అంత పనీ చేయదన్న గ్యారెంటీ ఏముంది ? అందుకే ఇది కళ్లు తెరవాల్సిన సమయం. ఈ దేశాన్ని డబ్బుతో దహించాలనుకుంటున్న బీజేపీ విషయంలో బహుపరాక్. బీ కేర్ ఫుల్.
– Rajashekar Kancharla