Site icon vidhaatha

ఆ.. బాధలోనే ప్రచారానికి దూరంగా విదేశాలకు.. నా ఆశీస్సులు స్రవంతికే: ఎంపీ కోమటిరెడ్డి

విధాత: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా తన స్థానాన్ని తిరిగి నిల బెట్టుకోవడం కోసం శ్రమిస్తున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రచారంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ.. కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపుతున్నారు.

ఈ సమయంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీరుపై సొంత పార్టీ కార్యకర్తలే తప్పుపడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికే ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారని, అందుబాటులో ఉండాల్సిన ఈ కీలక సమయంలో కావాలనే విదేశీ పర్యటనకు వెళ్తున్నారని విమర్శల నేపథ్యంలో వెంకట్ రెడ్డి స్పందించారు.

కోమటిరెడ్డి సోదరులు కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అని కేటీఆర్ విమర్శించడంపై ఎంపీ వెంకటరెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి అంటే నిజాయితీకి మారు పేరు అని.. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అన్నారు. కాదనే ధైర్యం ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. స్పష్టం చేశారు.

మంత్రి కేటీఆర్‌ తనపై చేసిన కోవర్ట్‌ కామెంట్స్‌ విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న నన్ను కోవర్ట్‌ అనే అర్హత కేటీఆర్‌కు ఉందా? వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ దేశాలు తిరిగి ఏం చేశారో,చేస్తారో నాకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఒక్క ఎంపీ కూడా పార్టీ మారరని తెలిపారు.

సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలోనే నేను ప్రచారానికి వెళ్లడం లేదన్నారు. విదేశీ పర్యటన నా వ్యక్తిగతమని.. ఏ ముఖంపెట్టుకుని మళ్లీ మునుగోడు ప్రచారానికి వెళ్లాలని ఆయన ఆవేదన వ్యక్దం చేశారు. నా ఆశీస్సులు ఎప్పుడూ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికే ఉంటాయని తెలిపారు.

Exit mobile version