విధాత: ఓ మహిళా ఎమ్మెల్యే.. పార్టీ కార్యకర్తను పెళ్లి చేసుకుంది. ఆ జంటను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు. మరి ఈ పెళ్లి ఎవరిది, ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే పంజాబ్ వెళ్లాల్సిందే. పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గానికి చెందిన నరీందర్ కౌర్ భరజ్(28), మణ్‌దీప్(29) ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. వీరిద్దరూ 2014 నుంచి పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు.
అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నరీందర్ కౌర్‌కు అవకాశం వచ్చింది. ఆమె ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. ఇక మణ్‌దీప్ సంగ్రూర్ జిల్లా మీడియా ఇంచార్జిగా కొనసాగుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వీరిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో నిన్న నరీందర్, మణ్‌దీప్ వివాహం జరిగింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దంపతులు హాజరై, ఆ నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకలు చాలా సాధారణంగా, అతి తక్కువ ఖర్చుతో నిర్వహించారు. పంజాబ్ అసెంబ్లీలో అత్యంత పిన్న వయసున్న ఎమ్మెల్యే ఎవరంటే నరీందర్ కౌర్ మాత్రమే.