మ‌హిళ‌ల‌కు అండ‌గా ‘Women’s Safety Wing’: SP రోహిణి

లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ విధాత, మెదక్ బ్యూరో: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్నలింగ అసమానత సమస్య పై 'లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం' అనే పోస్టర్ ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సోమవారం ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది రాష్ట్రంలోని మహిళల భద్రత, గౌరవం, సాధికారత కోసం పని చేస్తున్న తెలంగాణ […]

  • Publish Date - December 5, 2022 / 02:03 PM IST
  • లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

విధాత, మెదక్ బ్యూరో: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్నలింగ అసమానత సమస్య పై ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే పోస్టర్ ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సోమవారం ఆవిష్కరించారు..

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది రాష్ట్రంలోని మహిళల భద్రత, గౌరవం, సాధికారత కోసం పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగమని తెలిపారు. అలాగే మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల విచారణను నిర్వహించడానికి ఈ వింగ్ రూపొందించిన‌ట్టు చెప్పారు.

ఇందులో ప్రత్యేకంగా అక్రమ రవాణా, లైంగిక నేరాలు, గృహ హింస, బాల్య నేరాలు, ఎన్‌ఆర్‌ఐ సమస్యలు, సైబర్ నేరాలు, మహిళలు మ‌రియు పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం వంటి సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలను అందించనున్న‌ట్టు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో 03 డిసెంబర్ 2022 నుంచి 23 డిసెంబర్ 2022 వరకు నిర్వహించనున్న‌ట్టు పేర్కొన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళలు, పిల్లలకు భద్రత క‌ల్పించ‌డ‌మే అని అన్నారు. లింగ సమానత్వం అనేది స్త్రీ పోరాటం మాత్రమే కాదని మానవ పోరాటమని, బాధితులు తమ సమస్యని చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఓపికగా విని, తగిన మద్దతు ఇవ్వాల‌ని కోరారు.

రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో షీ టీమ్ నిర్వ‌ర్తించాల్సిన విధుల గురించి వివరించారు. హింసకు, వివక్షకు గురి అయిన మహిళలకు ప్రైవేట్, పబ్లిక్ ప్రదేశాలలో, కుటుంబంలో, సంఘంలో, కార్యాలయంలో కూడా మద్దతు ఇవ్వాల‌ని సూచించారు. లింగ వివక్ష ఎంతటి దురాచారమో పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్, పబ్లిక్ కార్యాలయాలలో షీ టీమ్ సిబ్బంది, కళాకారుల‌ బృందం అవగాహన కల్పించాలని తెలిపారు.

బాధిత మహిళల సమస్యలను పరిష్కరించి, వారికి తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో ఈ కార్యక్రమాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. తమకు భరోసా కల్పించే అధికారులతో మనసు విప్పి జరిగిన అన్యాయాన్ని వివరించవచ్చని తమకు ఎదురైన సమస్యను ఫిర్యాదు చేయడానికి భయపడవలసిన అవసరం లేదని అలాంటి వారికి అండగా నిలిచేదే మహిళా భద్రతా విభాగమని అన్నారు.

ముఖ్యంగా బాధిత మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి మెరుగైన జీవనం సాగించేలా భరోసా కల్పించాలని అన్నారు. 24 గంటల పాటు పోలీసులు అందుబాటులో ఉండి బాధితులకు అండ‌గా ఉంటార‌ని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీసీఐ నవీన్ బాబు, ఆర్.ఐ. నాగేశ్వర్ రావు, షి టీమ్ సిబ్బంది విజయ్, గంగమణి తదితరులు పాల్గొన్నారు.