Site icon vidhaatha

అమ్మో.. ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయా!

విధాత‌: ఉద్యోగాల‌కు గ్యారంటీ లేకుండా పోతున్న‌ది. ఆర్థిక మాంద్యం, వ్య‌య నియంత్ర‌ణ‌, ఔట్ సోర్సింగ్‌.. కార‌ణం ఏదైనా ఇప్పుడు కొలువులు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా గ్లోబ‌ల్ కార్పొరేట్లు భారీ ఎత్తున లేఆఫ్‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ ప్ర‌భావం క‌నిపిస్తున్న‌ది. భార‌త్‌కూ ఈ సెగ పెద్ద ఎత్తునే త‌గిలే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు.

క‌రోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జాబ్ మార్కెట్‌ను ఆర్థిక మాంద్యం భ‌యాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ‌త ఏడాది ద్వితీయార్ధం నుంచి మొద‌లైన ఉద్యోగ కోత‌లు.. ఈ ఏడాదీ కొన‌సాగుతాయ‌న్న అంచ‌నాలు వ్యాపార‌, పారిశ్రామిక రంగాల్లో గ‌ట్టిగానే ఉన్నాయి. ఇప్ప‌టికే 70వేల‌కుపైగా ఉద్యోగాలు రిస్కులో ప‌డ్డాయి.

అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ల్లో 31,000

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్.. ఈ ఏడాది ఆరంభంలోనే 18,000 మంది ఉద్యోగుల‌కు గుడ్‌బై చెప్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రిటైల్‌, హ్యూమ‌న్ రిసోర్సెస్ వ్యాపారాలు, స్టోర్స్ డివిజ‌న్ల‌లో ఈ కొత‌లుండ‌నున్నాయి. గ్లోబ‌ల్ స్టాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ సైతం గ‌త ఏడాది 3,000 మందిని తీసేసింది. ఈ వ‌చ్చే నెలాఖ‌రుక‌ల్లా మ‌రో 10,000 మందిని ఇంటికి పంపుతామంటున్న‌ది.

అల్ఫాబెట్‌, మెటాల్లో 23,000

గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌లో 12,000 మందిని తీసేస్తున్నారు. ప్రాంతీయ ఆంక్ష‌లు త‌దిత‌ర కార‌ణాల‌తో ఈ ఏడాది వీరిని తొల‌గించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ‌ మెటా సైతం 11,000 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. బైజూస్‌లో 4,000, ట్విట్ట‌ర్‌లో 3,700 మంది, ఫోర్డ్‌లో 3,580 మంది, క్విక్ డెలివ‌రీ స‌ర్వీస్‌ బ్లింకిట్‌లో 1,600 ఉద్యోగులు ప్ర‌మాదంలో ప‌డ్డారు. డెల్ టెక్నాల‌జీస్ సైతం 6,650 మంది ఉద్యోగుల‌ను తీసేయాల‌ని చూస్తోంది.

దేశీయ ఐటీ రంగంలోనూ..

దేశీయ ఐటీ రంగంలోనూ సంక్షోభ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. చాలా సంస్థ‌లు ఫ్రెష‌ర్ల‌పైనా వేటు వేస్తున్నాయి. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ప్ర‌తికూల ప‌రిస్థితుల న‌డుమ త‌గ్గిన ప్రాజెక్టుల‌తో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు దిగుతున్నాయి. ప‌రిస్థితులు ఇలాగే ఉంటే మ‌రిన్ని ఉద్యోగాలు పోయే అవ‌కాశం లేక‌పోలేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

Exit mobile version