Site icon vidhaatha

యాదాద్రి నరసన్నా.. నీతో బాగా కరుసన్నా!

టికెట్లు, తలనీలాలు రేట్స్ పెంపు

ఉన్నమాట: బంగారు తెలంగాణ అచ్చింది.. అందరి బతుకులూ బంగారు మయమైనయ్‌ అనుకున్నారో ఏందో ప్రభువులు.. ఆఖరికి పేదల దేవుడిని కూడా బాగా కాస్ట్లీ చేసేశారు. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల పాలిట కల్పతరువుగా పేరుగాంచిన యాదగిరి నర్సన్నను బంగారు తెలంగాణ పాలకులు వచ్చాక బాగానే అభివృద్ధి చేశారు. వందల కోట్లతో మొత్తం ఆలయ స్వరూపమే మార్చేశారు.

దీనికి ప్రభుత్వం నుంచి కొంత కేటాయించగా విరాళాలు సైతం బాగానే వచ్చాయ్. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి ఈ అలయ పునర్వ్యవస్థీకరణ బాధ్యత అప్పగించగా డిజైన్ అంతా బ్రహ్మాండంగా కుదిరింది. ఆలయం మస్తుగా తయారైంది.. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆలయం ఇప్పుడు డబ్బున్న వాళ్లకే తప్ప పేదలకు అందని స్థితికి చేరుకుంది.

ఏ టికెట్ కొందామన్నా వందల్లోకి పెంచేశారు. గతంలో ఓ పదో.. పాతికో ఇస్తే అయిపోయే దర్శనానికి ఇప్పుడు రూ.150 పెట్టాల్సి వస్తోంది. ఇక గుట్ట మీదకు కార్లో పోవాలంటే డీజిల్ ఖర్చు కన్నా పార్కింగ్ కోసమే ఎక్కువ అవుతోంది. గుట్ట మీద కార్ పార్కింగ్ చేయాలంటే భారీ గానే పెట్టాలి. ఈ డబ్బుతో డీజిల్ పోసుకుంటే కార్లో సగం దూరం పోవచ్చు.

ఇక ఆ మధ్య 100 ఉన్న స్పెషల్ దర్శనం టికెట్ ధరను నూటయాభై చేశారు. ఇవన్నీ పక్కన బెడితే ఆలయానికి ఆదాయం తెచ్చేది తలనీలాలు. భక్తులు స్వామి వారికి సమర్పించే తలనీలాల టికెట్ కూడా రూ.20 నుంచి 50 చేశారు. పెంచడానికి అవకాశం ఉన్న ప్రతి వనరునూ బాగా ఉపయోగించుకుని భారీగా రేట్లు పెంచేసి నర్సన్నకు భక్తులను దూరం చేస్తున్నారు. మొత్తానికి నర్సన్నను చూడాలంటే బోలెడు కరుసయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు.

Exit mobile version