Site icon vidhaatha

ఢిల్లీ మద్యం స్కాం: YCP ఎంపీ ఆఫీసుల్లో సోదాలు

విధాత: ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు, భారీ ఎత్తున కుంభకోణం జరిగిందన్న ఆరోపణల మీద ఆమధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలువురు నాయకులకు ఆమధ్య నోటీసులు ఇవ్వగా ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెలుగు రాష్ట్రాల్లోని కొందరు నాయకుల ఆఫీసుల మీద అదే ఎన్ఫోర్స్మెంట్ మళ్ళీ సోదాలు చేస్తోంది.

వాస్తవానికి ఈ కేసులో సీబీఐ ఆగస్టు 19న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు చేసింది. అప్పట్లో కొన్ని ఆధారాలు సేకరించిన ఈడీ నేడు శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 చోట్ల సాదాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని లోథీ రోడ్డులో 95వ నంబర్ నివాసంలో ఉంటున్న మాగుంట ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీంతోపాటు నెల్లూరు లోని ఆయన నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి.

ఇదే కేసుకు సంబంధించి కేసీఆర్ కుమార్తె కవితకు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ, నెల్లూరుల్లోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలోని పలు ప్రాంతాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్రెడ్డి అభిషేక్ ప్రేమ్సాగర్రావు అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం దోమలగూడ సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దోమలగూడ శ్రీసాయికృష్ణా రెసిడెన్సీలో ఉన్న గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ మద్యం స్కాముకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్లో రెండుసార్లు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

గతంలో కోకాపేట్లోని రామచంద్ర పిళ్లై నివాసం తోబాటు ఆయనకు చెందిన డిస్టలరీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాబిన్ డిస్టలరీస్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్.ఎల్.పి. పేరుతో రామచంద్ర పిళ్ల్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అభిషేక్ బోయినపల్లి ఇంకా గండ్ర ప్రేమ్ సాగర్ రావులు డైరెక్టర్లుగా ఉన్నారు.

గతంలో అభిషేక్ బోయినపల్లి.. ఎమ్మెల్సీ కవిత పీఏగా పని చేశారు. దీంతోబాటు కేసీఆర్ కుమార్తె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. గతంలో కవిత పీఏ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కవిత పర్సనల్ ఆడిటర్.. నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు ఆర్థిక సలహాదారుగాను, ఆడిటర్, ఎకౌంటెంట్ గా పని చేశారని సమాచారం. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసు ఓపెన్ చేస్తే ఆంధ్ర తెలంగాణ లింకులు బయటపడుతున్నాయి అన్నమాట.

Exit mobile version