New Leave Encashment Rule
విధాత: కొత్త లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మినహాయింపు గురించి మీకు తెలుసా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ నయా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూల్‌ను మంత్రి తీసుకొచ్చారు.
ప్రభుత్వేతర వేతన జీవుల కోసం లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపును పెంచుతూ బడ్జెట్‌లో మంత్రి ప్రతిపాదనలు చేశారు. ఈ క్రమంలోనే పన్ను రహిత లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు.
రెవిన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వివరాల ప్రకారం ఈ పన్ను మినహాయింపు నిర్ణయంతో 30-35 ఏండ్ల సర్వీసున్న ఉద్యోగులకు ఏటా రూ.20,000 ఆదా అవుతున్నది. పన్ను రహిత లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితి రూ.22 లక్షల పెరిగిందని గుర్తుచేస్తున్నారు.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో 50 శాతం వేతన జీవులే. దీంతో ఈ నిర్ణయం పదవీ విరమణ చేసేటప్పుడు వీరందరికీ లాభిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిమ్స్ ఉద్యోగులకూ ఈ ప్రయోజనం వర్తిస్తుందని ఆయన చెప్పారు.
ఏమిటీ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్?
దేశీయ కార్మిక చట్టాల ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏటా కొన్ని వేతనంతో కూడిన సెలవులుంటాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ సెలవులన్నింటినీ ఉద్యోగులు వాడుకోలేరు. ఇలా మిగిలిన సెలవులను సాధారణంగా తర్వాతి ఏడాదికి బదిలీ చేస్తారు.
అయితే ఉద్యోగి పదవీ విరమణ లేదంటే రాజీనామా చేసినప్పుడు మిగిలిపోయిన ఈ సెలవులన్నింటిని నగదుగా మార్చుకోవచ్చు. సెలవులను లెక్కించి ఆ ఉద్యోగికి వారి సంస్థ నగదు చెల్లిస్తుంది. దీన్నే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అని పిలుస్తారు.