Site icon vidhaatha

ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూపులేనా..! ఉపాధ్యాయనోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల నిరీక్ష‌ణ‌

ఉన్నమాట: రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో వేలాది ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నియామకాలు చేపడుతామని ఏళ్ల తరబడి చెప్తూనే ఉన్నది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సుమారు 12 వేల వరకు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నది. ప్రమోషన్లతో మరో 10 వేలు భర్తీ చేయాల్సి ఉన్నది. నిన్నగాక మొన్న కూడా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు త్వరలో ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి త‌ప్ప‌ ఆచరణకు నోచుకోవ‌డం లేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మొత్తం 2,440 బోధన సిబ్బంది ఖాళీల భర్తీ కోసం ఆర్థికశాఖ జులై 22న అనుమతి ఇచ్చింది. అయినా ఇప్పటివరకు నోటిఫికేషన్‌ వెలువడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. దీంతో రోస్టర్‌ పాయింట్ల విధానం మారుతుంది. అయితే అదీ కొలిక్కి వచ్చిందనే వార్తలు వచ్చాయి.

కానీ ఈ కారణంతోనే నోటిఫికేషన్ల విడుదలకు ఆలస్యమ‌వుతున్నదని అధికారులు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు. నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించి 8 నెలలు కావొస్తున్నది. ఇప్పటికీ ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని విమర్శిస్తున్నారు.

విద్యాశాఖలో దాదాపు 9 వేల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నది. గతంలో ఉన్న 12 వేల మంది విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తొలిగించింది. దీంతో ఉపాధ్యాయుల కొరత మ‌రింత తీవ్రంగా ఉన్నది. అంతేకాదు టెట్‌ నిర్వహించి ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపడుతామని ప్రకటించింది. టెట్‌ ఫలితాలు వచ్చి కూడా ఐదు నెలలు కావొస్తున్నది.

ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని 2014 మ్యానిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికీ ఎనిమిదేళ్లు గడిచిపోయినా నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైంది. జాతీయస్థాయిలో అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం చివరి స్థానాల్లో ఉన్న విషయాన్ని విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Exit mobile version