విధాత, ఢిల్లీ: తెలంగాణలో పార్టీ పెట్టినప్పుటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు ఆరోపణలకే పరిమితం అయిన షర్మిల.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్ ఢిల్లీ వెళ్లీ.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. త్వరగా విచారణ జరపాలంటూ ఈ ఉదయం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఓ కాంట్రాక్ట్ సంస్థతో కలిసి కాళేశ్వరంతో పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని వివరించారు. ఓ కంపెనీతో కలిసి లక్ష కోట్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయమై మొన్నటికి మొన్న వైఎస్ షర్మిల.. గవర్నర్ తమిళిసైకి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని సమస్యల గురించి ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని తెలిపారు. అలాగే కాళేశ్వరం ముంపు, వర్షాల వల్ల కల్గిన నష్టం గురించి కూడా గవర్నర్ కు వివరించారు. తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే చర్చిస్తారా లేక ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడతారా అనే డిస్కషన్ జరుగుతోంది.
ఇటీవలే తన తండ్రిని కుట్రచేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య ఢిల్లీ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఢిల్లీలో సీబీఐతోపాటు బీజేపీ ఏ స్థాయి నేతలతో సమావేశం అవుతారన్నదానిపై స్పష్టత లేదు.