గుణ: మనసులో ఏమున్నదో ఒక్కోసారి యథాలాపంగా బయటకు వస్తూనే ఉంటుంది. అలానే పాపం మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు.. తన మనసులో మాట బయటపెట్టేశారు. డిగ్రీలు సంపాదించుకుంటే సాధించేది ఏమీ లేదని, జీవనోపాధికి విద్యార్థులు మోటర్‌సైకిల్ పంక్చర్‌షాపులు పెట్టుకోవాలని ఉచిత సలహా పడేశారు. పైగా.. తన గుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ‘ప్రధాన మంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’కు ప్రారంభోత్సవం చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య ఈ వెటకారపు వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. ‘ఈ రోజు మనం పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించుకుంటున్నాం. మీరొక మంచి మాట గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అనగానే విద్యార్థులంతా ఏదో గొప్ప విషయం చెప్పబోతున్నారని ఆసక్తిగా చెవులు రిక్కించారు. తీరా చూస్తే.. ‘ఈ కాలేజీ డిగ్రీలతో ఎలాంటి లాభం లేదు. వాటికి బదులు మోటర్ సైకిళ్లకు పంక్చర్ వేసే రిపేర్ షాపులు పెట్టుకోండి. కనీసం మీకు జీవనోపాధి అయినా లభిస్తుంది’ అని చెప్పేసరికి విద్యార్థులు అవాక్కయ్యారు. ఇదేనా విద్యార్థుల పట్ల బీజేపీకి ఉన్న భావన అని ముక్కున వేలేసుకున్నారు.
ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇండోర్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాల్లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ క్రమంలో గుణ సహా వివిధ జిల్లాలో విడిగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇండోర్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో మాట్లాడిన అమిత్‌షా.. దేశంలో నూతన విద్యా విధానం తీసుకురావడంతో ప్రధాని మోదీ దూరదృష్టిని కొనియాడారు. కానీ.. గుణ ఎమ్మెల్యే మాత్రం దానిని పక్కనపెట్టేసి.. పంక్చర్ షాపులు పెట్టుకోవాలని సూచించడం పలువురి విమర్శలకు దారి తీసింది.
‘స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ లక్ష్యం పెట్టుకున్నారు.. నూతన విద్యా విధానం ఇందులో కీలక పాత్ర పోషించనున్నది. అభివృద్ధి చెందిన దేశంగా మారే క్రమంలో విద్యారంగ పునాదులను పటిష్టం చేసుకోవాలి. అందుకే రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని మోదీ నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చారు’ అని చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా గుణ బీజేపీ ఎమ్మెల్యే పంక్చర్ షాపులు పెట్టుకోవాలని ఉద్భోదిస్తున్నారు!
డిగ్రీలు దండగ.. పంక్చర్ షాపులు పెట్టుకోండి : విద్యార్థులకు బీజేపీ ఎమ్మెల్యే సలహా!
