న్యూఢిల్లీ: అమృత్ సర్ నుంచి సహర్సా సమధ్య నడిచే గరీబ్‌రథ్ రైలులో భారీగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న రైలులో పంజాబ్‌లోని సర్హింద్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో మూడు బోగీలు దగ్ధమయ్యాయి. దీనికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పొగను గమనించగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి, రైలు నుంచి దిగిపోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన రైలు నుంచి దిగిపోయారు. రైలులో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. రైలులో అగ్ని ప్రమాదంతో ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను ప్రర్యవేక్షిస్తూ..ప్రయాణికులకు ఇబ్బంది కల్గకుండా చర్యలు చేపట్టారు.