న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం ఆ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో కూడా చర్చనీయాంశమైంది. గత 20 ఏళ్లుగా (2014 నుంచి 2015 వరకు ఒక ఏడాది మినహా) బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకతో ప్రజలు ఈ ధఫా యువతరం నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు పట్టం కడుతారని అంచనాలు ఎగ్జిట్ పోల్స్ తోనే ఫటాపంచలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువగా ఎన్డీఏ కూటమి సీట్లు సాధించబోతుండటం సంచలనంగా మారింది. దీంతో మళ్లీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ధఫా నితీష్ పార్టీ జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. మిగిలిన 41 సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాయి.
ఆర్జేడీకి తగ్గిన ఓట్ల శాతం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చూస్తే ఇండియా కూటమి గతం కంటే దారుణ పరాజయం ఎదుర్కోబోతుందని తెలుస్తుంది. బీహార్ భవిష్యత్తు సీఎంగా ప్రచారం జరిగిన తేజస్వీ యాదవ్ తను పోటీ చేసిన నియోజకవర్గంలో పోటాపోటీ ఎదుర్కొంటూ ఎదురీదుతున్నారు. ఆయన పార్టీ ఆర్జేడీ 2010తర్వాత అతి తక్కువ ఓట్ల శాతానికి పడిపోనున్నట్లుగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. క్రికెటర్ గా, యువ నాయకుడిగా ఉన్న తేజస్వీ యాదవ్ కు ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేసేలా ఉన్నాయి. కనీసం హాఫ్ సెంచరీ సీట్లు కూడా సాధించలేని పరిస్థితిలో తేజస్వీ పడిపోయారు.
పనిచేయని రాహుల్ గాంధీ, తేజస్వీ ఛరిస్మా
బీహార్ ఎన్నికల్లో యువనేతగా క్రేజ్ సాధించిన తేజస్వీ యాదవ్ ఛరిస్మతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చరిస్మా కూడా పనిచేయకపోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయపరిచింది.
రాహుల్ గాంధీ, తేజస్వీలను జెన్ జడ్ యువత కూడా పట్టించుకోలేదని ఫలితాలు చాటుతున్నాయంటున్నారు. ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సైతం ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బీహార్ ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల్లో రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ వివాదం, ఓట్ల చోరీ, హైడ్రోజన్ బాంబు ప్రెస్ మీట్ కూడా ఓటర్లపై ప్రభావం చూపలేదని, వాటిని ప్రజలు పట్టించుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అటు ప్రతిపక్ష మహాఘట్ బంధన్ పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీ సహా వాటి మిత్ర పక్షాల మధ్య చివరి వరకు సీట్ల పంపిణీలో గందరగోళం నెలకొనడం కూడా ఎన్నికల్లో ఓటమికి ఓ కారణంగా నిలిచింది.
పనిచేసిన డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్ లు ఎన్నికల్లో జట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమి ఘన విజయంలో కీలకంగా పనిచేశారని విశ్లేషకులు చెబుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం, అభివృద్ధి ఎన్నికల్లో ఎన్డీఏకు విజయాన్ని కట్టబెట్టిందంటున్నారు. ముఖ్యంగా సీఎం నితీష్, పీఎం మోదీల చరిస్మా ప్రజల్లో ప్రభావం చూపిందని భావిస్తున్నారు. పహాల్గామ్ ఉగ్రదాడి నుంచే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన ప్రధాని మోదీ ఓ వైపు ప్రజల్లో జాతీయవాద భావనను ప్రేరేపించి దానికి బీజేపీనే సంకేతమన్నట్లుగా ప్రచారం చేసుకోవడం, మరోవైపు కేంద్రం నుంచి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్యాకేజీలు ప్రకటించడం కూడా ఎన్డీఏకు ఎన్నికల్లో సానుకూల ఫలితాలు అందించిందని చెబుతున్నారు. మహిళా ఓటర్లు ఎన్డీఏకు మద్దతునివ్వడం..ఎన్నికలకు ముందు వారికి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్థిక సహాయం పథకం ప్రకటించడం ఆ పార్టీకి సానుకూలత ఫలితాన్నిచ్చింది.
