Allu Arjun | ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో వచ్చిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. సెట్స్‌లో బన్నీని కలవాలంటే 42 రకాల రూల్స్ ఉంటాయని, కళ్లలోకి కూడా చూడకూడదని ఒక నార్త్ మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం మధ్యలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన నటుడు రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు.
గత నాలుగేళ్లుగా ‘పుష్ప 1’ , ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ సమయంలో బన్నీతో చాలా దగ్గరగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఆయన వ్యక్తిత్వం గురించి తాను బాగా తెలుసని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. అల్లు అర్జున్ సెట్స్‌లో ఎలా ప్రవర్తిస్తారో వివరిస్తూ రాజశేఖర్ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. బ్రేక్ టైమ్‌లో ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ ఒకే బేసిన్‌లో స్నాక్స్ తీసుకొస్తే, ఇతర ఆర్టిస్టులకు అసిస్టెంట్లు ఉన్నప్పటికీ బన్నీ మాత్రం ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసి అదే బేసిన్ నుంచి తీసుకుని తింటారని తెలిపారు. అంత సింపుల్‌గా, గ్రౌండ్ టు ఎర్త్‌గా ఉండే వ్యక్తి 42 రూల్స్ పెట్టుకుంటారని నమ్మడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలు కేవలం పబ్లిసిటీ కోసం చేసినవిగా కనిపిస్తున్నాయని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్‌పై పేరు కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రతి రోజు సెట్స్‌కు వచ్చిన వెంటనే టెక్నీషియన్లు, ఆర్టిస్టులను విష్ చేయడం బన్నీ అలవాటని, ఎవరినైనా మర్చిపోయినా సారీ చెప్పే వినయం ఆయనలో ఉందని గుర్తుచేశారు. అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని, మనుషులకు గౌరవం ఇవ్వడం ఆయనకు బాగా తెలుసని రాజశేఖర్ పేర్కొన్నారు. కళ్లలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు వంటి ఆరోపణలు కేవలం అటెన్షన్ కోసం సృష్టించినవేనని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదివరకు అల్లు అర్జున్ టీమ్ కూడా ఈ విషయంపై లీగల్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బన్నీతో కలిసి పనిచేసిన వ్యక్తులే ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి కొంతవరకు ముగింపు పలికినట్లే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా మాట్లాడొచ్చు గానీ, నిజం మాత్రం మారదనే వాదన వినిపిస్తోంది.
