Elections | మీకు ఎన్నికల్లో ప్రస్తావనకు వచ్చే B ఫామ్‌, A ఫామ్‌ మధ్య తేడా తెలుసా..?

  • Publish Date - April 11, 2024 / 08:58 AM IST

Elections : ఎన్నికలు ఎప్పుడొచ్చినా B-ఫామ్‌ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. పలానా పార్టీ తన అభ్యర్థులకు B-ఫామ్స్‌ ఇచ్చిందా..? పలానా అభ్యర్థికి B-ఫామ్‌ దక్కిందా..? అనే మాటలను మనం వింటూ ఉంటాం. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ B-ఫామ్‌ అనే పదం మళ్లీ వినపడుతోంది. మరి ఇంతకూ ఈ B-ఫామ్‌ అంటే ఏమిటో తెలుసా..?

ఓ పత్రంలో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, నియోజకవర్గ వివరాలు ఉంటాయి. వాటి కింద ఆ పార్టీ అధ్యక్షుడి సంతకం ఉంటుంది. దాన్నే B-ఫామ్‌ అంటారు. అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ను సమర్పించే సమయంలో B-ఫామ్‌ను కూడా దానికి జతచేస్తారు. నామినేషన్‌తోపాటు B-ఫామ్‌ జతచేసిన అభ్యర్థులకు మాత్రమే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గుర్తును కేటాయిస్తారు.

అయితే B-ఫామ్‌తోపాటు A-ఫామ్‌ అనేది కూడా ఒకటి ఉంటుందని మీకు తెలుసా..? ఎన్నికల్లో B-ఫామ్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో A-ఫామ్‌ కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. కానీ B-ఫామ్‌ అనే పదం మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఎందుకంటే B-ఫామ్‌ ఒక్కో అభ్యర్థి పేరుతో ప్రత్యేకంగా ఇస్తారు. ఒక అభ్యర్థి B-ఫామ్‌తో మరో అభ్యర్థి B-ఫామ్‌కు పోలిక ఉండదు.

కానీ A-ఫామ్‌ మాత్రం ఒక పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ ఒకేలా ఉంటుంది. A-ఫామ్‌లో పార్టీ పేరు, పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు అందరి పేర్లు, ఏయే అభ్యర్థి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే వివరాలు ఉంటాయి. పోర్జరీకి ఆస్కారం లేకుండా ఫామ్‌లో పార్టీ అధ్యక్షుడు చేసిన మూడు సంతకాలు ఉంటాయి.

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌తోపాటు B-ఫామ్‌ను జతచేసి సమర్పించిన అభ్యర్థులు.. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌కు A-ఫామ్‌ను సమర్పిస్తారు. ఎన్నికల కమిషన్‌ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన B-ఫామ్‌ను, తనకు నేరుగా అందజేసిన A-ఫామ్‌ పోల్చిచూసి నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం సదరు అభ్యర్థి సదరు పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని ప్రకటిస్తుంది. దాంతో ఒక అభ్యర్థి అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారవుతుంది.

Latest News