నాలుగో ద‌శ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. తెలంగాణ‌లో నామినేష‌న్లు షురూ

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. నాలుగో ద‌శ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం ఉద‌యం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కిం అసెంబ్లీలు స‌హా 10 రాష్ట్రాల్లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

  • Publish Date - April 18, 2024 / 10:08 AM IST

న్యూఢిల్లీ : లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. నాలుగో ద‌శ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం ఉద‌యం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కిం అసెంబ్లీలు స‌హా 10 రాష్ట్రాల్లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నాలుగో విడ‌త‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్, జ‌మ్మూక‌శ్మీర్ ఉన్నాయి. మొత్తం 96 లోక్‌స‌భ స్థానాల‌కు మే 13వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఈ ద‌శ‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో.. ఆయా రాష్ట్రాల్లో గురువారం ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 25వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కొన‌సాగ‌నుంది. 26న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఏప్రిల్ 29. మే 13న పోలింగ్ నిర్వ‌హించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఇక లోక్‌స‌భ‌కు పోటీ చేసే అభ్య‌ర్థులు రూ. 25 వేల చొప్పున ధ‌రావ‌త్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే స‌రిపోతుంది.

ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 1.80 లక్షలమంది పోలింగ్‌ సిబ్బంది, మరో 25 వేలమంది ఇతర సిబ్బంది, 60 వేలమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా అందులో రెండు ఎస్టీ, మూడు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్‌సభ స్థానానికి ఈవీఎంపై తెలుపురంగు బ్యాలెట్‌ను ఉపయోగించగా, కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో మాత్రం గులాబీరంగు బ్యాలెట్‌ పేపర్‌ను ఉపయోగించ‌నున్నారు.

కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక

లోక్‌సభతో పాటే కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు కూడా పోలింగ్‌ జరగనుంది. నియోజకవర్గంలో 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 232 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో ఓటర్లు

మొత్తం ఓటర్లు ; 3,30,21,735
పురుషులు ; 1,64,31,777
మహిళలు ; 1,65,87,221
థర్డ్‌ జెండర్‌ ; 2,737

Latest News