హైదరాబాద్, అక్టోబర్ 13 (విధాత): దేశంలో పసిడి ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు లేనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్వరలోనే ధన త్రయోదశి ఉండటంలో దాని డిమాండ్ కారణంగా ఈ వారాంతంలో పుత్తడి ధర దేశవ్యాప్తంగా రూ.1.30 లక్షలు దాటే అవకాశం ఉందని బులియన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో తులం ధర రూ. 1,27,700కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా పరుగెత్తుతున్నాయి. కిలో వెండి రూ. 1.77 లక్షలు దాటేసి రికార్డు నెలకొల్పింది.
బంగారం ధర పెరగడాకికి ప్రధాన కారణాలు
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అంతర్జాతీయ రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొనడంతో బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. యుఎస్ ఎకనామీ సమస్యలు, మధ్యప్రాచ్య, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు బంగారాన్ని సేఫ్ హెవెన్‌గా మార్చాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ వల్ల డాలర్ బలహీనపడి, బంగారం ధరలు పెరిగాయి.
దీంతో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి. చైనా (పీబీఓసీ) 2025లో 22.7 టన్నులు, భారత్ (ఆర్బీఐ) 770 టన్నుల రిజర్వులు పెంచుకుంది. దీని కారణంగా దేశీయ ధరలను 23% పెరిగాయి.
ఇదిలా ఉంటే భారతదేశంలో దీపావళి, అక్షయ త్రీతీయ, వివాహాల సీజన్‌లో డిమాండ్ 40% పెరిగింది. ఇంఫ్లేషన్ (రూ. మూల్యాంకం తగ్గుదల) వల్ల బంగారం హెడ్జ్‌గా మారింది. ఇంపోర్ట్ డ్యూటీ (15%) , జీఎస్టీ (3%) కూడా ధరలను పెంచాయి. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో రూ.16.63 బిలియన్ ఇన్‌ఫ్లోలు, ఇన్వెస్టర్లు డైమండ్‌ల వైపు మళ్లినా బంగారం డిమాండ్ బలంగా ఉంది.
పెరుగుతున్న బంగారం ధరలు చూసి సామాన్యులు బెబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు బంగారం సాంప్రదాయక గౌరవం. వివాహాలు జరిగితే సాధారణంగా 5 నుంచి 10 తులాల 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనేవారు. కానీ పెరుగుతున్న ధరల కారణంగా 3 నుంచి 5 తులాలు కొనేలోపే నానా తంటాలు పడాల్సి వస్తుంది.సామాన్యులకు బంగారం ఒక సంపద, భద్రతకు చిహ్నం కానీ ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనాలనే ఆశలను పక్కకు పెట్టేస్తున్నారు.