Significance of Sankranti |
‘‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే ఏ ఏ ఏ
ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో పొంగే హేమంత సిరులు..’’
తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ప్రధాన పండుగల్లో ‘సంక్రాంతి’ ఒకటి. మూడు రోజుల పాటూ జరిగే ఈ పండుకకు పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. ఉద్యోగం కోసం, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా సంక్రాంతి పండక్కి సొంతూళ్లబాట పడతారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంటుంది. డూడూ బసవన్నలు, హరిదాసులు, పగటి వేషగాళ్లు, ఎడ్లపందేలు, రంగవల్లుల పోటీలు, కోళ్ల పందేళ్లు ఆకర్షణగా నిలుస్తాయి. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు సంతోషంగా జరుపుకొనే పెద్ద పండుగ. అందుకే దీన్ని వ్యవసాయ పండుగ అని కూడా అంటారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. మూడ్రోజుల ముచ్చటైన పండుగ. ముత్యాల ముగ్గులతో లోగిళ్లు నిండగా.. భోగ భాగ్యాలతో భోగి చేసుకోగా.. సంక్రాంతి సకల సంపదలు తేగా.. అష్టైశ్వర్యాలు సిద్ధించాలని.. ఆయురారోగ్యాలు సొంతమవ్వాలని.. మనసారా ఆకాంక్షిస్తూ.. కనువిందుగా నిర్వహించే పండుగ. ఈ సంక్రాంతికి మరో రెండు రోజులే సమయం ఉండటంతో.. ఇప్పటికే గ్రామాల్లో సందడి మొదలైంది. ఈ సందర్భంగా పండుగ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భోగితో మొదలై..
సంక్రాంతి పండుగ భోగితోనే మొదలవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందురోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకే తెల్లవారుజామున భోగిమంటల్ని వేస్తారు. చలికాచుకున్న తర్వాత భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో స్నానం చేస్తారు. ఇక సాయంత్రం వేళ ఐదేండ్లలోపు చిన్నారులకు భోగిపళ్లు పోయడమూ ఓ సంప్రదాయమే. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకొనే శక్తి రేగుపండుకు ఉంటుంది. ఈ పండ్లను పిల్లలపైన పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగుపండ్లు, చెరకుముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూరేకులు… తదితరాలను కలిపి భోగిపండ్లను పోసి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే విష్ణుమూర్తి స్వయంగా పిల్లలను దీవిస్తాడని ప్రతీతి.
గుమ్మడికాయ దానం..
భోగి మర్నాడు వచ్చే పండుగే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టే ఈరోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు. ఈ రోజునుంచీ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఏడాది మొత్తం చేసే దానధర్మాలతో పోలిస్తే.. మకర సంక్రాంతి నాడు దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున గుమ్మడికాయ, నువ్వులు, బెల్లం, కూరగాయలు దానం చేస్తారు. నువ్వులు, బెల్లం, కలిసి లడ్డూలు, నువ్వుల రొట్టెలు, చెకోడీలు, చకినాలు వంటి వంటలు తయారు చేస్తారు. అలాగే కూరగాయాలన్నింటినీ వాయనంగా సమర్పించుకుంటారు. మకర సంక్రమణం రోజు నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. తలకు నూనె రాసుకుని శనగపిండితో స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది విశ్వాసం.
కనుమకు ఎంతో ప్రాధాన్యం
మూడ్రోజుల పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగలో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పండుగను పశువుల పండగగా జరుపుకోవడం ఆనవాయితీ. కనుమ అంటే పశువు అని అర్థం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ రోజును మేష సంక్రాంతిగా కూడా పిలుస్తారు. ఏడాదిపాటు పొలం పనుల్లో తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువులను పూజించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఆరోజున పశువులు, కొట్టాలను అందంగా అలంకరిస్తారు. పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే నేవైద్యాన్ని పొలంలో చల్లి పాడి పంటలు బాగా పండాలని వేడుకుంటారు.
రంగవల్లికలు, కైట్ ఫెస్టివల్, బసవన్నల సందళ్లు..
సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రంగవల్లికలే. భోగి, సంక్రాంతి, కనుమల రోజు ఆడపడుచులు తమ ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులను వేస్తారు. వీటి మధ్యలో గొబ్బెమ్మలు ఉంచుతారు. ముగ్గును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. గొబ్బెమ్మలను పూజిస్తే శుభాలు కలుగుతాయన్నది నమ్మకం. అంతేకాదు, ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. హరిదాసుల సంకీర్తనలు, పిల్లాపాపలు సల్లంగుండాలని డూడూ బసవన్నలు దీవించే దృశ్యాలు మరింత ఆకర్షిస్తాయి. సంక్రాంతిరోజున పతంగులు ఎగురవేయడం కూడా సాధారణమే. ఊరూరా చిన్నా, పెద్ద తేడా లేకుండా గాలి పటాలు ఎగురవేస్తూ సందడి చేస్తుంటారు. ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం.
