– భోగి వేడుకల్లో ఉత్సాహంగా స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు
– ‘సంబరాల రాంబాబు.. అంబటి రాంబాబు’ హోరెత్తిన పాట
– సత్తెనపల్లి గాంధీబొమ్మ వద్ద భోగి వేడుకల సందడి
విధాత: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకలు హోరెత్తాయి. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గాంధీ బొమ్మ సెంటర్ సందడిగా మారింది. ప్రజలు భారీగా తరలివచ్చారు. భోగి మంటలు వేసి దానిచుట్టూ తిరుగుతూ మంత్రి అంబటి రాంబాబు వేసిన మాస్ డ్యాన్స్ ఆకట్టుకుంది. వేడుకల వద్ద మంత్రి సందడి అంతాఇంతా కాదు.. బంజారా మహిళలతో కలసి హుషారుగా స్టెప్పులేశారు. ‘సంబరాల రాంబాబు.. అంబటి రాంబాబు’ అనే ప్రత్యేక పాటకు భోగి మంటల చుట్టూ తిరుగుతూ రాంబాబు వేసిన స్టెప్పులు హుషారెత్తించాయి. గత ఏడాది కూడా భోగి వేడుకల్లో భాగంగా ఇదే సంక్రాంతికి మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా భోగి మంటల వద్ద మంత్రి అంబటి రాంబాబు మరోసారి సందడి చేశారు.
వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లె, పట్టణంలోనూ భోగి మంటలు వేసి ప్రజలు సంబరాలు చేసుకుంటారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొంటారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్ లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కొనసాగిన వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులు తరలివచ్చారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లిలో ప్రతికుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలననదే నా ఆలోచన అని అన్నారు. ‘నేను సంక్రాంతి వేడుకలు చేస్తుంటే అందరూ నన్ను సంబరాల రాంబాబు అంటున్నారు.. సంక్రాంతికి నేను సంబరాల రాంబాబునే. సంక్రాంతి దాటితే నేను పొలిటికల్ రాంబాబుని’ అంటూ మీడియా వద్ద రాంబాబు సెటైర్ వేశారు.