Site icon vidhaatha

రాహుల్‌ జోడోయాత్రలో లోక నాయకుడు కమల్‌ హసన్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. సెప్టెంబర్‌ కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర జనవరి చివరి నాటికి జమ్మూ కశ్మీర్‌లో ముగించాలన్న లక్ష్యం యాత్ర చేపట్టిన రాహుల్‌.. దిగ్విజయంగా ముందుకుసాగుతున్నది. శనివారం యాత్ర ఢిల్లీకి చేరగా.. లోక నాయకుడు కమల్‌ హసన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం చేతులు కలపాల్సిన సమయం వచ్చిందని, రాహుల్‌ పాదయాత్రలో పాల్గొనవద్దని చాలా మంది చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌ నేత యాత్రలో పాల్గొంటే పొలిటికల్‌ కెరియర్‌ దెబ్బతింటుందని హెచ్చరించారని, అయితే తాను భారతీయుడిగా యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు.

తన తండ్రి కాంగ్రెస్‌ వాది అని, తాను వివిధ సిద్ధాంతలకు కలిగి ఉండి.. సొంత రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు చెప్పారు. దేశ విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని తాను అద్దం ముందు నిలబడి చెప్పుకున్నానని, ఇది దేశానికి, తనకు అత్యవసరమైన సమయం అంటూ కమల్‌ వ్యాఖ్యానించారు. మరో వైపు రాహుల్‌ యాత్ర ఢిల్లీకి చేరగా.. ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇప్పటి వరకు దాదాపు 3వేల కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. యాత్ర ముగిసేలోపు 3570 కిలోమీటర్లు ప్రయాణించనుండగా.. 12 రాష్ట్రాల మీదుగా సాగనున్నది. యాత్ర ఎర్రకోటకు చేరగా రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని వాస్తవ సమస్యల నుంచి మళ్లించేందుకు బీజేపీ విద్వేశాలను వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తిన రాహుల్‌.. ఇది మోదీ ప్రభుత్వం కాదని.. అంబానీ, అదానీల ప్రభుత్వం అంటూ తీవ్రంగానే స్పందించారు.

Exit mobile version