VS Achuthanandan death | కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వి.ఎస్ . అచ్యుతానందన్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 101 ఏళ్లు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 నుంచి ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరువనంతపురంలోని ఆయన కొడుకు వి. అరుణ్ కుమార్ ఇంట్లో ఉంటున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా కేరళ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.
1923 అక్టోబర్ 20న ఆయన పునప్పరలో ఆయన పుట్టారు. నాలుగేళ్ల వయస్సులో ఆయన తల్లి చనిపోయారు. ఆయనకు 11 ఏళ్ల వయస్సులో తండ్రి చనిపోయారు. దీంతో ఆయన ఏడో తరగతి పూర్తికాగానే చదువుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. 1938లో ఆయన స్టేట్ కాంగ్రెస్ లో చేరారు. 1934-38 మధ్యలో అచ్చుతానందన్ తన సోదరుడితో కలిసి టైలర్ షాపులో పనిచేసేవారు. అదే సమయంంలో కొబ్బరిపీచు పరిశ్రమలో కూడా పనికి వెళ్లేవారు. ఇక్కడ పనిచేసే సమయంలోనే ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ఆయ న 1940లో సీపీఐ సభ్యుడిగా మారారు. అలప్పుజాలో భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఆయన వయస్సు 16 ఏళ్లు. 1946లో ఉన్న కల్నల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటంలో అచ్యుతానందన్ ది కీలకపాత్ర.
సీపీఐ నుంచి సీపీఐ(ఎం) ఏర్పాటులో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. సీపీఐ నుంచి సీపీఎం ఏర్పాటు చేసేందుకు బయటకు వచ్చిన 32 మంది నాయకుల్లో ఈయన కూడా ఒకరుఎమర్జెన్సీ సమయంలో అచ్యుతానందన్ జైలు జీవితాన్ని అనుభవించారు. 2009లో సీపీఎం పొలిట్ బ్యూరో నుంచి ఆయనను పార్టీ బహిష్కరించింది. సీపీఐఎం స్టేట్ సెక్రటేరియట్ నిర్ణయాలను ధిక్కరించినందుకు ఆయనపై వేటు పడింది.. మళ్లీ 1985లో ఆయన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. 1965లో అంబలప్పుళ స్థానం నుంచి ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇదే స్థానంతో పాటు మరియాకులం, మలంపుజా స్థానాల్లో నుంచి గెలిచారు. 44 ఏళ్లకు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. 82 ఏళ్లకు కేరళ రాష్ట్రానికి సీఎం అయ్యారు. కేరళ అసెంబ్లీలో మూడుసార్లు విపక్ష నాయకుడిగా ఉన్నారు.
అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ప్రజల గొంతును వినిపించారు. అక్రమ లాటరీ మాఫియా, ఆదీవాసీ ప్రజలపై పోలీసుల ఫైరింగ్,ప్లాచిమాడలో కోకా కోలా ఫ్యాక్టరీ ఆపరేషన్స్ పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కోచిలో టెర్మినల్, కొల్లంలో టెక్నో పార్క్, కన్నూర్ లో ఎయిర్ పోర్ట్, కోచ్చిలో మెట్రో ప్రతిపాదనలు అచ్యుతానందన్ సీఎంగా ఉన్నప్పుడే చేశారు.