కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం పేరు మారడం విశేషం. కేంద్ర క్యాబినెట్ ఆమోదం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేరళ (పేరు మార్పు) బిల్లు 2026ను కేరళ రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు. భారత రాజ్యాంగంలోని 3వ అధికరణం మేరకు అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుతారు. కేరళ అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు.
రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ సహా అన్ని భాషల్లో కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. 2023, 2024లో అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. తొలిసారి చేసిన తీర్మానాన్ని సమీక్షించిన కేంద్ర హోం శాఖ.. కొన్ని సాంకేతిక మార్పులను సూచించిన అనంతరం రెండో తీర్మానం ఆమోదం పొందింది.
‘మలయాళంలో మన రాష్ట్రం పేరు ‘కేరళం’. 1956 నవంబర్ ఒకటో తేదీన భారతదేశంలోని రాష్ట్రాలు భాషాప్రాతిపదికన ఏర్పడ్డాయి. కేరళ ఆవిర్భావం రోజు కూడా అదే నవంబర్ 1. మలయాళం మాట్లాడేవారికి ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పాటు చేయాలని స్వాతంత్ర్య పోరాట కాలం నుంచీ బలమైన డిమాండ్ ఉంది. అయితే.. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మన రాష్ట్రం పేరును కేరళగా రికార్డు చేశారు. రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ మేరకు కేరళ పేరును కేరళంగా మార్చేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నది’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
2016లో గురుగావ్ పేరును గురుగ్రామ్‌గా మార్చినప్పుడు కేరళను కేరళంగా, అహ్మదాబాద్‌ను అమరావతిగా, హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా, ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గా పేర్లు మార్చాలని ఆరెస్సెస్ అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గురు ద్రోణాచార్యకు నివాళిగా గురుగావ్‌ను గురుగ్రామ్‌గా మార్చారు.
