విధాత: ఇటీవల విమానంలో తోటి ప్రయాణికులపై అసభ్య ప్రవర్తనల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పూణె-నాగ్‌పూర్‌కు వెళ్లే ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటి ప్రయాణికురాలిని ఒకరు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్టుచేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ నివాసి అయిన 40 ఏండ్ల మహిళ తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సోమవారం నాగ్‌పూర్ ఫ్లైట్ ఎక్కారు. పక్క సీటులో కూర్చున్న పుణెలోని కొంధ్వా ప్రాంతానికి చెందిన వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన 32 ఏండ్ల ఫిరోజ్ షేక్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు గురిచేశాడు. విమానం దిగిన తర్వాత నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విమానాశ్రయంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది నిందితుడు ఫిరోజ్ షేక్ అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 354 (ఏదైనా మహిళపై దాడి చేయడం లేదా నేరపూరిత శక్తిని ఉపయోగించడం, ఆమె అణకువకు భంగం కలిగించడం), 354 (ఏ) (లైంగిక వేధింపులు), 509 (పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్ అధికారి వెల్లడించారు.