దేశవ్యాప్తంగా మహాలక్ష్మి

లోక్‌సభ ఎన్నికల్లో గట్టి సవాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. పేద, మధ్యతరగతి, యువత, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తన మ్యానిఫెస్టోను శుక్రవారం

  • Publish Date - April 5, 2024 / 09:36 AM IST


పేద కుటుంబాలకు ఏటా లక్ష నగదు బదిలీ
కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల పోస్టుల భర్తీ
కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరిన్ని రిజర్వేషన్లు
అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు
దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణ
25 లక్షల వరకూ నగదు రహిత బీమా
కనీస మద్దతు ధరలకు లీగల్‌ గ్యారెంటీ
ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో
విడుదల చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం
వివాదాస్పద అగ్నిపథ్‌ కార్యక్రమం రద్దు
సాధారణ పద్ధతిలో రిక్రూట్‌మెంట్లు
కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవస్థను రద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి
12వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య
విదాస్పద రాజద్రోహ చట్టాన్ని ఎత్తివేస్తాం
కనీస వేతనం రోజుకు 400 రూపాయలు
జీఎస్టీని రద్దు చేసి, దాని స్థానంలో జీఎస్టీ 2
వివక్షపై రోహిత్‌ వేముల పేరిట చట్టం
ప్రభుత్వ పరీక్షలు, పోస్టుల దరఖాస్తు రుసుం రద్దు.
మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్‌
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం

పార్టీ ఫిరాయిస్తే చట్టసభ సభ్యత్వం రద్దు
పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు
రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత
ఎలక్టోరల్ బాండ్స్పై విచారణ
విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం
రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ

పెగాసెస్, రాఫెల్‌పై విచారణ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గట్టి సవాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. పేద, మధ్యతరగతి, యువత, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తన మ్యానిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది. తిరిగి ఓటర్ల విశ్వాసం పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత, ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు సహా అనేక కీలక హామీలు ఇచ్చింది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న కుల గణన అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాము అధికారంలోకి వస్తే కుల గణన, సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తామని స్పష్టంచేసింది. పేద కుటుంబాల్లో వెలుగు నింపేలా.. బేషరతు నగదు బదిలీ కింద దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష రూపాయలను మహాలక్ష్మి పథకం కింద అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయ్‌ పత్ర్‌ పేరుతో 46 పేజీల మ్యానిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పీ చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ తదితరులు న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఇందులో ఐదు గ్యారెంటీలను ప్రముఖంగా పేర్కొన్నారు. రాజస్థాన్‌ తరహాలో సార్వజనీన ఆరోగ్య సంరక్షణ కింద 25 లక్షల వరకూ నగదు రహిత బీమా సదుపాయం కల్పిస్తామని మ్యానిఫెస్టో ప్రకటించింది. సమానత్వం, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సమాఖ్య స్ఫూర్తి, జాతీయ భద్రత, పర్యావరణం వంటి అంశాలపై కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కేంద్రీకరించింది.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం అత్యంత కీలకమైనదని కాంగ్రెస్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు అనేక అంశాలను మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అన్ని కులాలు, మతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేకుండా విద్య, ఉద్యోగాల్లో పదిశాతం కోటా కల్పిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే మంజూరైన 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. రైట్‌ టు అప్రెంటిస్‌షిప్‌ చట్టం తెస్తామని ప్రకటించింది. దీని ప్రకారం 25 ఏళ్లలోపు డిప్లొమా హోల్డర్‌ ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌ చేసుకోవచ్చు. ఈ కాలంలో అతనికి ఏడాదికి లక్ష రూపాయల స్టయిపెండ్‌ అందిస్తారు.

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా ప్రతి యేటా ప్రకటించే కనీస మద్దతు ధరలకు లీగల్‌ గ్యారెంటీ ఇస్తామని తెలిపింది.

వివాదాస్పద అగ్నిపథ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసి, సాధారణ పద్ధతిలో సాయుధ దళాల్లోకి నేరుగా రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తామని పేర్కొన్నది. జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్రప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. పట్టణ ఉద్యోగ కార్యక్రమం ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవస్థను రద్దు చేసి, రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని తెలిపింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకించి ఉన్నత విద్యలో ఇచ్చే ఉపకార వేతనాలను రెట్టింపు చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు సహాయం అందిస్తామని తెలిపింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని 15(5) అధికరణం ఆధారంగా ఒక చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.

రాజద్రోహ చట్టాన్ని ఎత్తివేస్తామని, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షిస్తామని తెలిపింది. ఘర్షణలు, విద్వేషపూరిత నేరాల కేసులలో నిర్లక్ష్యానికి పోలీసు, అధికారులను బాధ్యులను చేస్తామని తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు చట్టం తెస్తామని హామీ ఇచ్చింది. ఆధార్‌ వాడుకను నియంత్రిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని, ఇది 2025 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది. కనీస వేతనం రోజుకు 400 రూపాయలు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని రద్దు చేసి, దాని స్థానంలో జీఎస్టీ 2 తీసుకొస్తామని తెలిపింది.

విద్యాసంస్థల్లో వెనుకబడిన, పీడిత వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపై రోహిత్‌ వేముల పేరిట చట్టం తెస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన రోహిత్‌ వేముల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనితోపాటు.. హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన వారిని, ప్రత్యేకించి మహిళలను జడ్జీలుగా నియమిస్తామని హామీ ఇచ్చింది.

మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..
ఎల్జీబీటీక్యూఐఏ జంటల మధ్య సహజీవనాన్ని గుర్తించేలా చట్టం.
పేపర్‌ లీకేజీలపై విచరాణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు. బాధిత విద్యార్థులకు నష్టపరిహారం. స్టార్ట్‌అప్‌లకోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ స్కీం పునర్వ్యవస్థీకరణ. అందుబాటులో ఉన్న నిధుల్లో 50శాతం జిల్లాల్లో 40 ఏళ్లలోపు యువతకు సొంత వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు కేటాయింపు.
ప్రభుత్వ పరీక్షలు, పోస్టుల దరఖాస్తు రుసుం రద్దు.

ఉపాధి హామీ చట్టం కింద రోజువారీ వేతనం 400కు పెంపు. అదే జాతీయ సగటు వేతనంగా నిర్ణయం.
కార్పొరేట్‌ కంపెనీలకు ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు.. అదనపు నియామకాలపై పన్ను మినహాయింపులు
టెలికమ్యూనికేషన్ల చట్టం, 2023పై సమీక్ష, ఆంతరంగిక గోప్యతను ఉల్లంఘించే, భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించే అంశాల తొలగింపు.

చట్టం ప్రకారం పోలీసులు, దర్యాప్తు సంస్థలు నడుచుకునేలా హామీ. వాటిని పార్లమెంటు, అసెంబ్లీల పర్యవేక్షణ కిందకు తేవడం.

చట్టాలను ఆయుధాలుగా చేసుకునే విధానాలకు స్వస్తి. విచక్షణారహిత, ఉద్దేశపూర్వక అరెస్టులు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగాలు, ఏకపక్ష తనిఖీలు, జప్తులు, దీర్ఘకాలపు కస్టడీలు, లాకప్‌మరణాలు, బుల్డోజర్‌ జస్టిస్‌ వంటి విధానాలకు చెల్లుచీటీ.

అన్ని నేర చట్టాల్లో బెయిల్‌ అంశంపై చట్టం.
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం పునరుద్ధరణ.
ఎన్నికల వ్యవస్థలో మార్పులు. ఈవీఎంలను ఉపయోగిస్తూనే.. ఓటరు వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్పును బ్యాలెట్‌ బాక్సులో వేసేలా, వాటిని కూడా ఈవీఎంల ఓట్లతో సరిపోల్చేలా వ్యవస్థ.
ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.
ద్వంద్వం పన్నుల వ్యవస్థకూ చరమగీతం. రాష్ట్రాలకు వారి వాటా మేరకు పన్నుల ఆదాయం పంపకం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సర్‌చార్జీలు మొత్తం పన్ను ఆదాయంలో 5 శాతం మించకుండా విధింపు.

భారీ స్థాయిలో పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూలు సవరణ. పార్టీ ఫిరాయించగానే ఎంపీ లేదా ఎమ్మెల్యే సభ్యత్వం దానంతట అదే రద్దు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదించిన జాతీయ న్యాయ కమిషన్‌ ఏర్పాటు. దాని ద్వారానే

సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం.
న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులతో జ్యుడిషియల్‌ కంప్లైంట్స్‌ కమిషన్‌ ఏర్పాటు.
దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ
పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు
వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత
ఎలక్టోరల్ బాండ్స్పై విచారణ
విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం
రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
పెగాసెస్, రాఫెల్‌పై విచారణ

Latest News