Naveen Yadav | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubleehills By Poll )లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ( Congress Party ), ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఈ పరిణామాల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్( Naveen Yadav ) సోదరుడు గౌతమ్ యాదవ్( Gautam Yadav ).. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలో గౌతమ్ యాదవ్ గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా గౌతమ్ యాదవ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయి యాదవ్, నగేశ్ ముదిరాజ్ ఉన్నారు.
నవీన్ యాదవ్‌కు గౌతమ్ యాదవ్ సోదరుడు ఎలా అంటే..?
పెద్ద శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ఇద్దరు సొంత అన్నదమ్ముళ్లు. ప్రస్తుతం చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గౌతమ్ యాదవ్ పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడు. సొంత పెద్దనాన్న కుమారుడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
ఈ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ విత్‌డ్రా కోసం అక్టోబర్ 24 వరకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నిక కోసం 400 పోలింగ్ బూత్‌లకు అదనపు సిబ్బందిని కేటాయించారు.