IND vs NZ: 3rd T20I | ఆల్​రౌండ్​ ప్రతిభతో అదరగొట్టిన భారత్​ : టి20 సిరీస్​ కైవసం

గువాహటిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. బుమ్రా, బిష్ణోయ్ బౌలింగ్‌తో పాటు అభిషేక్, సూర్య విధ్వంసం ఆకట్టుకుంది.

Abhishek Sharma and Suryakumar Yadav celebrating partnership during India vs New Zealand 3rd T20I match

India vs New Zealand 3rd T20I: Abhishek, Surya Power India to Series Win

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

IND vs NZ: 3rd T20I | న్యూజీలాండ్​తో గువాహటిలో జరిగిన 3వ టి20 మ్యాచ్​లోనూ భారత్​ ఘనవిజయం సాధించి 5 మ్యాచ్​ల సిరీస్​ను 3 – 0తో కైవసం చేసుకుంది. టాస్​ ఓడిపోయి తొలుత బ్యాటింగ్​ చేసిన కివీస్​ 153 పరుగులకే చేతులెత్తేసింది. భారత బౌలర్లు, ఫీల్డర్ల కట్టుదిట్టాలతో పరుగులు చేయడానికి అపసోపాలు పడ్డ న్యూజీలాండ్​, వికెట్లను కూడా అదేరీతిలో సమర్పించుకుని ఓటమిపాలైంది. తదనంతరం, అభిషేక్​, సూర్యకుమార్​ల విధ్వంసంతో కేవలం 2 వికెట్లు కోల్పోయి, 8 వికెట్ల తేడాతో సరిగ్గా 10 ఓవర్లకే ఘన విజయాన్ని అందుకుంది.

చితక్కొట్టిన అభిషేక్​ – కెప్టెన్​ సూర్య

154 పరుగుల తేలికైన లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజ్​లోకి వచ్చిన భారత ఓపెనర్లలో సంజూసాంసన్​(0) వరుసగా 3వ మ్యాచ్​లోనూ నిరాశపర్చాడు. ఇన్నింగ్స్​ తొలిబంతికే పెవిలియన్​ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్​ కిషన్​ తన దూకుడును ఈ మ్యాచ్​లోనూ కొనసాగించాడు. 13 బంతుల్లో 28 పరుగులు చేసి, సోధీ బౌలింగ్​లో ఔటయ్యాడు. మరోపక్క, అభిషేక్​ తన పని తాను చేసుకుంటూ పోయాడు. 14 బంతులకే అర్థ శతకం చేసిన అభిషేక్(68 పరుగులు, 5 సిక్స్​లు, 7 ఫోర్లు)​, కెప్టెన్​ సూర్యకుమార్​తో కలిసి ఇంకో వికెట్​ పడకుండా వీజయతీరాలకు చేర్చాడు. సూర్య కూడా గత మ్యాచ్​లో చేసిన విధ్వంసాన్ని కొనసాగిస్తూ, 26 బంతుల్లో 57(3 సిక్స్​లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాటౌట్​గా మిగిలాడు. వీరిద్దరూ 3వ వికెట్​కు 40 పరుగుల్లో 102 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. న్యూజీలాండ్​ బౌలర్లలో హెన్రీ, సోధీ చెరో వికెట్​ సాధించారు.

బుమ్రా – బిష్ణోయ్ – హార్దిక్ ధాటికి కివీస్ కుదేలు

కాగా, టాస్​ ఓడిపోయి, బ్యాటింగ్​ బరిలోకి దిగిన న్యూజీలాండ్​ను గుక్కతిప్పుకోకుండా తిప్పలు పెట్టారు భారత బౌలర్లు, ఫీల్డర్లు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌, అద్భుత ఫీల్డింగ్​తో కివీస్‌ను 153 పరుగులకే పరిమితం చేసి భారత్ పైచేయి సాధించింది.

ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత బౌలర్లు మొదటి నుంచే ఒత్తిడి పెంచారు.

పవర్‌ప్లేలోనే కివీస్‌కు షాక్

పవర్‌ప్లేలోనే భారత్ న్యూజిలాండ్‌కు గట్టి దెబ్బ కొట్టింది. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కివీస్ వెనుకబడ్డారు. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్లోనే అద్భుత క్యాచ్ అందుకుని డెవాన్ కాన్వే (1)ను పెవిలియన్‌కు పంపి, బౌలింగ్​లో రచిన్ రవీంద్ర (4), డేంజరస్​ డారెల్​ మిచెల్​ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

తర్వాత వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తొలిబంతికే టిమ్ సీఫర్ట్ (12) వికెట్‌తో ఆరంభించి మొత్తం 3 వికెట్లతో కివీస్‌ను కుదిపేశాడు. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రవి బిష్ణోయ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. మధ్య ఓవర్లలో పరుగులేమీ ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై పూర్తిస్థాయి నియంత్రణ సాధించాడు.

ఫిలిప్స్ – చాప్మన్ పోరాటం

గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ చాప్మన్ (32)తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ భాగస్వామ్యాన్ని బిష్ణోయ్ బద్దలుకొట్టడంతో న్యూజిలాండ్ మళ్లీ వెనుకబడింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.  అయినా బుమ్రా, హార్దిక్, బిష్ణోయ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించారు. భారత బౌలర్లలో, బుమ్రా 3, బిష్ణోయ్​, హార్థిక్​ చెరో 2, హర్షిత్​ ఒక వికెట్​ తీసుకున్నారు.

పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన భారత్​

మొత్తం ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం న్యూజిలాండ్ రన్‌రేట్ ఆరు కంటే తక్కువగానే కొనసాగింది. చివరికి 153పరుగులకే పరిమితమై భారత్‌కు సులభసాధ్యమైన లక్ష్యాన్ని విధించింది.  అటు బౌలింగ్​లోనూ, ఇటు బ్యాటింగ్​లోనూ భారత్​ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కివీస్​కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఘన విజయతీరాలకు చేరింది. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా జస్ప్రీత్​ బుమ్రా ఎంపికయ్యాడు.

4వ టి20 ఈనెల 28వ తేదీ, బుధవారం నాడు విశాఖపట్నంలో జరుగనుంది.

Latest News