Anil Ravipudi | మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు స్టామినా మరోసారి ప్రూవ్… అనిల్ రావిపూడికి మెగాస్టార్ మెగా గిఫ్ట్!

Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ, ఈ మూవీ అన్ని సినిమాలను వెనక్కి నెట్టి రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 2026లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న తొలి చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలవడం విశేషం.

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది. ముఖ్యంగా చిరంజీవి తన గ్రేస్, టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు లేని చిరంజీవికి ఈ సినిమా ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌గా నిలిచింది.ఈ ఘన విజయంలో దర్శకుడు అనిల్ రావిపూడి పాత్ర కీలకం. చిరంజీవి గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించకపోయినా, అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెగాస్టార్‌కు మరచిపోలేని బ్లాక్‌బస్టర్ అందించారు.

ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 9 సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి లాంటి అతి కొద్ది మంది దర్శకులకు మాత్రమే ఈ అరుదైన రికార్డు ఉంది. ఇదిలా ఉండగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఘనవిజయాన్ని పురస్కరించుకుని చిరంజీవి అనిల్ రావిపూడికి మెగా గిఫ్ట్ అందించారు. దర్శకుడికి చిరు ఒక కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మూవీ ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

అయితే కారు బహుమతి అందించిన సందర్భంగా చిరంజీవి అనిల్ రావిపూడికి కొన్ని హితవులు కూడా చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అంటూ చిరు సూచించారు. ఈ సందర్భంగా చిరంజీవి సరదాగా “కారు నచ్చిందా?” అని అడగ్గా, అనిల్ రావిపూడి వెంటనే సినిమాలోని ఫేమస్ డైలాగ్‌తో “మెగా బహుమతి మహదానందం, మనోధైర్యం, ధనాధన్!”
అని సమాధానం ఇవ్వడం అక్కడ నవ్వులు పూయించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, అభిమానులు ‘హిట్ మెషీన్‌కు మెగా గిఫ్ట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, అనిల్ రావిపూడి విజయాల సరసన మరో బ్లాక్‌బస్టర్‌ను జోడించింది.

Latest News