Chiranjeevi’s Emotional Letter After ‘Mana Shankara Varaprasad Garu’ Hits Massive Box Office Milestone
‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ లేఖ రాశారు.
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ దాటిన సందర్భంగా, ఈ విజయం పూర్తిగా ప్రేక్షకులదేనని, వారి ప్రేమే తన నిజమైన శక్తి అని ఆయన పేర్కొన్నారు. మెగా అభిమానుల మనసులను స్పృశించిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాకి మరింత హైప్‌ను జోడించింది.
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
Chiranjeevi’s Letter | థియేటర్లలో భారీ హంగామా మధ్య ప్రభంజనం సృష్టిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీగా తరలిరావడంతో అన్ని షోలు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఒకప్పటి మెగాస్టార్ మెరుపులు, ఎలివేషన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా బంపర్ హిట్ టాక్‌తో అప్రతిహతంగా సాగుతోంది.
400 కోట్ల వైపుగా పయనిస్తున్న వరప్రసాద్ గారు
వరుసగా వసూళ్లను పెంచుకుంటూ వచ్చిన ఈ చిత్రం కేవలం ఒక వారంలోనే 292 కోట్ల గ్రాస్‌ను దాటగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఉత్తర అమెరికాలో చిత్రం 3 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటడం చిరంజీవి కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలవడం విశేషం. ఈ గణాంకాలు మెగాస్టార్ మార్కెట్‌కు ఇంకా ఉన్న అద్భుతమైన ప్రమాణాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా రికార్డు విజయానికి స్పందించిన చిరంజీవి, ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఒక భావోద్వేగ లేఖ రాశారు. “మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నా ప్రయాణానికి ఎప్పటినుంచో మీరే ప్రాణం. మీ ప్రేమే నాకు శక్తి, నాకు దారిచూపే వెలుగు,” అంటూ లేఖను ప్రారంభించారు.
మీ ప్రేమే నాకు పెన్నిధి : చిరంజీవి భావోద్వేగం
తన ప్రతి విజయానికి, ప్రతి మైలురాయికి అభిమానులే ప్రధాన కారణమని, వారి ప్రేమాభిమానాలే తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని చిరంజీవి పేర్కొన్నారు. “రికార్డులు వస్తాయి… పోతాయి… కానీ థియేటర్లలో మీరు వేస్తున్న విజిల్స్ మాత్రం శాశ్వతం. లాభాల కంటే మీరు చూపిస్తున్న ప్రేమే నాకు అసలైన నిధి,” అంటూ భావోద్వేగంతో స్పందించారు.
ALSO READ: ‘మన శంకరవరప్రసాద్ గారు’పై బన్నీ ప్రశంసలు: ఇది బ్లాక్‌బస్టర్ కాదు.. ‘బాస్‌బస్టర్’!
సినిమా టీమ్ గురించి ప్రస్తావిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి–సుస్మిత కొణిదెల, సాంకేతిక నిపుణులు, నటీనటులు—సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. “ఈ బ్లాక్‌బస్టర్ విజయం వారి కృషికి నిదర్శనం. నాపైన మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను,” అని చిరంజీవి పేర్కొన్నారు.
చిరంజీవి రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ లేఖను షేర్ చేస్తూ మెగాస్టార్ వినయం, ప్రేక్షకులతో ఆయనకున్న అనుబంధం, ప్రేమను ప్రశంసిస్తున్నారు. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వరద… మరోవైపు అభిమానుల హృదయాలను తాకిన మెగాస్టార్ భావోద్వేగ స్పందన—ఈ విజయాన్ని అభిమానులకు చిరస్మరణీయంగా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
