Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ చిత్రాల స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, ఎక్స్ లెజిట్ వైఫ్ మధ్య నలిగిపోయే మాజీ పోలీస్ అధికారిగా వెంకటేష్ చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన అపార స్పందన నార్త్ ఆడియన్స్‌కూ కనెక్ట్ అవుతుందని భావించిన మేకర్స్, బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు కథలో స్వల్ప మార్పులు చేసి త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
హిందీ రీమేక్‌లో వెంకటేష్ పాత్రను బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ పోషించనున్నారని టాక్ వినిపిస్తుండగా, తెలుగులో ఐశ్వర్య రాజేష్ చేసిన భార్య పాత్రకు వెర్సటైల్ యాక్ట్రెస్ విద్యా బాలన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అక్షయ్–విద్యా బాలన్ కాంబినేషన్ గతంలో మంచి సినిమాలకు గుర్తుగా నిలవడంతో ఈ జంటపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తెలుగులో మీనాక్షి చౌదరి చేసిన గ్లామరస్ రోల్‌ను హిందీలో ఎవరు చేస్తారు అన్న ఆసక్తికర చర్చలో, టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా పేరు బలంగా వినిపిస్తోంది. మొదట ఈ పాత్ర కోసం మీనాక్షి చౌదరినే పరిశీలించినప్పటికీ, హిందీలో రాశీకి ఉన్న గుర్తింపు, ఆమెకు లభించిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ ఆమె వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ సరసన రాశీ ఖన్నా నటిస్తే ఈ రీమేక్ ప్రాజెక్ట్‌పై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.
రాశీ ఖన్నా కెరీర్ విషయానికి వస్తే, ఆమె బాలీవుడ్‌లోనే ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో అరంగేట్రం చేసి, తర్వాత ‘మనం’లో స్పెషల్ క్యామియోతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హిందీలో ‘రుద్ర’, ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్‌లతో మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం హిందీలో ‘తలాఖోన్ మే ఏక్’, ‘బ్రిడ్జ్’ సినిమాలు, తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, తమిళంలో మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న రాశీకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ మరో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
