CM Revanth Reddy | అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నదని, ఆ నిర్ణయం రద్దుపై ఆదేశాలు ఇచ్చి.. అవసరమైతే బాధ్యులను లోపల వేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో బుధవారం గవర్నర్ ప్రసంగంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం చరిత్రాత్మకం.. తెలంగాణకు మార్గదర్శకం అన్నారు. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదని, రాజులు పోయినా రాచరిక పోకడలు మారలేదని విమర్శించారు. కొందరు తమను తాము ఇంకా రాజులని అనుకుంటున్నారని అన్నారు. రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంటుంది.. ఈ రోజు కూడా అదే విధంగా వారసత్వం వస్తుందని ఆశపడి భంగపడ్డారని రేవంత్ కేటీఆర్, కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
నాడు కూల్చుతామని కేసీఆర్ ప్రకటించారు…
మూసీ ప్రక్షాళనపై గతంలో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన మాటలను సభలో సీఎం వినిపించారు. ‘హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గతంలో కేసీఆర్ అన్నారు. నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలు కూల్చుతామని ప్రకటించారు. నాలాలపై నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చాలని గతంలో కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. గతంలో వాళ్లు చెప్పిన మాటలనే ఇవాళ తప్పుపడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలకు కడుపునిండా విషమే ఉంది’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని అనుకున్నామని, కొత్త గవర్నర్‌కు శుభాకాంక్షలు చెబుతారని భావించామని రేవంత్ తెలిపారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదని ఆక్షేపించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని, అయినా కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్పు చేశారని అనుకుంటున్నారని విమర్శించారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి ప్రదర్శించారని, దానితో ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా, ఇప్పుడూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
కోటికి పైగా జీతం తీసుకున్న కేసీఆర్
డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రూ.1 కోటి 6 లక్షల 56 వేల 674 జీతభత్యాలు పొందారని రేవంత్ రెడ్డి తెలిపారు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సభ్యులను కోరారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నా అని అన్నారు.
భవిష్యత్ లో ఏఐ సునామీ రాబోతుందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ ను గవర్నర్ గారి ప్రసంగంలో వివరించారని సీఎం తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను కనీసం చదివారా? చూశారా?’ అని ప్రశ్నించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది నవశకానికి నాంది పలుకాల్సిన సమయం అన్నారు.
అధికారం పోయిందన్న బాధతో ప్రతిపక్షం
అధికారం కోల్పోయామన్న దుఃఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రధాన ప్రతిపక్షానికి ఆలోచన లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అందుకే ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్…
తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించాం. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నాం చెప్పారు. మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని రేవంత్ రెడ్డి తెలిపారు.
