Paris Commune | పారిస్ కమ్యూన్‌కు 155 ఏండ్లు!

పారిస్ కమ్యూన్ 18-3-1871 తేదీన ఏర్పడింది. 28-5-1871 తేదీన రక్తసిక్త భౌతిక ఓటమితో ముగిసింది. భౌతికంగా 71 రోజులే మనుగడలో వుంది. కానీ రాజకీయంగా చరిత్రలో చిరకాలం వర్దిల్లుతుంది. భూమండలంలో తొలి సోషలిస్టు విప్లవం... పారిస్ కమ్యూన్ ఏర్పడ్డాక 46 ఏండ్ల తర్వాత 1917లో రష్యాలో జరిగింది. దానికి డ్రెస్ రిహార్సల్ వంటిదిగా 1905 నాటి ప్రధమ రష్యా విప్లవాన్ని లెనిన్ వర్ణించాడు. అది రష్యన్ విప్లవ కోణంలో సరైనది. కానీ ప్రపంచ విప్లవాల దృష్టికోణంలో పారిస్ కమ్యూన్ డ్రెస్ రిహర్సల్ వంటిదని చెప్పొచ్చు. అట్టి విశిష్ట ప్రాపంచిక రాజకీయ ప్రాధాన్యత గల పారిస్ కమ్యూన్ ఏర్పడి 155 ఏండ్లు! ఆ సందర్బ ప్రతిస్పందన యిది.

Paris Commune anniversary

Paris Commune | పారిస్ కమ్యూన్ చరిత్ర గూర్చి గానీ, ఆ చరిత్రకు గల రాజకీయ విశిష్టత గూర్చి గానీ, సమకాలీన ప్రపంచంలో ఆ చరిత్ర సంస్మరణకు గల ప్రాధాన్యత లేదా ప్రాసంగికతల గూర్చి గానీ వివరించడానికి ఈ రైటప్ రాయడం లేదు. వాటిపై కనీసం టూకీగా రెండు వాక్యాలు రాసే ప్రయత్నం కూడా కాదు. ఆ సందర్బంగా మార్క్స్, ఎంగెల్స్ లు చేపట్టిన వైఖరి యొక్క విశిష్టత పై రాస్తున్నది. అది కూడా టూకీగా మాత్రమే.

ఆనాటి ఫ్రాన్స్ భౌతిక, స్వీయాత్మక పరిస్థితులు కార్మికవర్గ తిరుగుబాటు చేయడానికి అనువుగా లేవని మార్క్స్, ఎంగెల్స్ స్పష్టంగా భావించారు. కమ్యూనిస్టు ప్రణాళిక రచనా కాలం (1848) లో ప్రధాన యూరోప్ దేశాల్లో కార్మిక విప్లవాలు వెల్లువెత్తాయి. కానీ అవి వైఫల్యం చెందాయి. మార్క్స్, ఎంగెల్స్ ఒక రాజకీయ గుణపాఠం తీసుకున్నారు. దానిని గుర్తు చేసుకుందాం.

పైన పేర్కొన్న విప్లవ వెల్లువ కాలంలో మార్క్స్ రచించిన “ఫ్రాన్స్ లో వర్గ పోరాటాలు” పుస్తకానికి నలభై ఐదేండ్ల తర్వాత (తన మరణానికి కొద్ది ముందు 1895 లో) పునర్ముద్రణకు ఎంగెల్స్ “ముందుమాట” రాశాడు. 1848 నాటి విప్లవ పరిస్థితిని తాము (మార్క్స్, ఎంగెల్స్) చాలా అతిగా అంచనా వేశామని చెబుతూ ఎంగెల్స్ ఇలా అంటాడు.
“…. మేము సైతం పొరపడ్డామనీ, ఆనాటి మా దృక్పధం ఒక భ్రమ అనీ చరిత్ర నిరూపణ చేసింది. అంతటితోనే అది ఆగలేదు. ఆనాడు మాకున్న పొరపాటు అభిప్రాయాలను అది తొలగించడమే కాకుండా ఏ పరిస్థితుల్లో శ్రామిక వర్గం పోరాడాలో ఆ పరిస్థితుల్ని సైతం పూర్తిగా మార్చివేసింది.”

అదే ముందుమాటలో ఎంగెల్స్ ఇలా అంటాడు.

“మేమూ, మాలాగే ఆలోచించిన ఇతరులు కూడా పొరబడినట్లు చరిత్ర నిరూపించింది. అప్పుట్లో యూరోప్ ఖండంలో వుండే ఆర్ధికాభివృద్ధి దశ పెట్టుబడిదారీ ఉత్పత్తిని తొలగించేందుకు అది ఎంతమాత్రం పరిపక్వం కాలేదని స్పష్టం చేసింది”

(పై అనువాదాన్ని నిడమర్తి ఉమారాజేశ్వర్ రావు గారు చేశారు.)

పై గుణపాఠాల రాజకీయ వెలుగులో మార్క్స్, ఎంగెల్స్ (ముఖ్యంగా మార్క్స్) పారిస్ కమ్యూన్ పూర్వ పరిస్థితి గూర్చి రాజకీయ పరిణితితో విశ్లేషణ చేసి అంచనా వేశారు. 1870 సెప్టెంబర్ తొలి వారంలో జరిగిన ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో బిస్మార్క్ సైన్యాల చేతుల్లో మూడో నెపొలియన్ చేజిక్కాడు. తర్వాత ఏర్పడ్డ నిర్ధిష్ట రాజకీయ సంక్షోభ స్థితిని మార్క్స్ ప్రత్యేక ఆసక్తితో విశ్లేషణ చేశాడు. నాటి ఫ్రాన్స్ నిర్ధిష్ట పరిస్థితితో సంబంధం లేకుండా ఒకే ఒక్క పారిస్ కార్మికవర్గం తిరుగుబాటుకు దిగితే అవివేకం, పిచ్చితనం అవుతుందని మార్క్స్ అంచనా వేశాడు. నాటి మొదటి ఇంటర్నేషనల్ వేదిక ద్వారా సూచనలు కూడా చేయించాడు. ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ జనరల్ కౌన్సిల్ తరపున 9-9-1870 తేదీన చేసిన విజ్ఞప్తిలో క్రింది వాక్యాలు చూద్దాం. ఇది పారిస్ కమ్యూన్ ఏర్పాటు కంటే ఆరు నెలల ముందు కావడం గమనార్హం!

“శత్రువు దాదాపుగా పారిస్ కవాటాలను తడుతున్న తరుణంలో, ప్రస్తుత సంక్షోభంలో, కొత్త ప్రభుత్వాన్ని కూలద్రోసే ఏ ప్రయత్నం చేసినా కూడా, దుస్సాహాసిక వెర్రి పనే అవుతుంది.” (డిటో అనువాదకులు)

పారిస్ కమ్యూన్ శత వార్షికోత్సవ సందర్బంగా 1981 లో “నవ సమాజ వైతాళికులు” పేరిట విశాలాంధ్ర ప్రచురించిన పుస్తకాన్ని తెలుగులోకి కే. రాజేశ్వర్రావు గారు అనువాదం చేశారు. అందులో మార్క్స్, ఎంగెల్స్ లు పారిస్ కమ్యూన్ కి ఇచ్చిన సలహాల గూర్చి చెప్పిన వాక్యాలను చూద్దాం.

“పారిస్ వాసుల్ని తప్పటడుగులు వేయడానికి వ్యతిరేకంగా వారు హెచ్చరించారు. ఆచరణీయ సలహాలు ఇచ్చారు. వారి తప్పుల్ని ఎత్తి చూపించారు.”

వారి సూచనల్ని బ్లాంక్విస్టులు మరియు బకునినిస్టులు పెడచెవిన పెట్టారు. అపరిపక్వ పరిస్థితుల్లో పారిస్ కమ్యూన్ ఏర్పడింది. అయినా తమ సలహా పాటించలేదనే భావం వారు తమ మనస్సులో పెట్టుకోలేదు. పైగా దానికి మనస్ఫూర్తిగా అండగా నిలబడ్డారు. పైగా వివిధ దేశాల కార్మిక సంస్థలని నిలబెట్టే కృషి చేశారు. మొక్కుబడిగా లేదా పరిమిత స్థాయిలో కాదు. అమితాసక్తి, పట్టుదలలతో కృషి చేశారు. మనకు అక్కడే మార్క్స్, ఎంగెల్స్ ల విశిష్టత కనిపిస్తుంది.

వస్తుగత భౌతిక పరిస్థితుల వల్ల ఓటమి పొందుతుందని తెల్సి కూడా పారిస్ కమ్యూన్ కి ఎందుకు మద్దతు ఇచ్చారని మార్క్స్, ఎంగెల్స్ లను వారి సమకాలిక కామ్రేడ్స్ కొందరు ప్రశ్నించారు. బూర్జువావర్గం తీవ్ర ఊచకోతకు దిగుతున్న కాలంలో అంతర్జాతీయ వాదులుగా అది తమ బాధ్యత అన్నారు. ఆ సందర్బంగా మార్క్స్ తన మిత్రుడు కుగెల్ మన్ కి 17-4-1871 న రాసిన లేఖలో ఈ క్రింది వాక్యాన్ని చూద్దాం.

“గురి తప్పని అనుకూల అవకాశాల షరతుల పై ఆధారపడి మాత్రమే పోరాటానికి పూనుకోవాల్సి వస్తే, ప్రపంచ చరిత్ర నిర్మాణం చాలా తేలిక ఐవుండేది. మరోవంక “యాద్రుచ్చిక” ఘటనలకు పాత్రయే లేకుండాపోతే, అది అత్యంత మార్మిక స్వభావం గలది అవుతుంది. ఈ యాద్రుచ్చిక ఘటనలు సహజంగానే సాధారణ అభివృద్ధి క్రమంలో ఒక భాగమై ఇతర యాద్రుచ్చిక ఘటనల చేత పరిహారించ బడతాయి.”

చరిత్ర గమనంలో గురితప్పని పోరాటాలే జరగవనీ, గురితప్పిన పోరాటాలు కొన్నిసార్లు జరుగుతాయని మార్క్స్ అంటాడు. వ్యవస్తీకృత పోరాటాలే కాకుండా యాద్రుచ్చిక పోరాటాలు కూడా జరుగుతాయని అంటాడు. యాద్రుచ్చిక పంథాలో గురిలేనిదిగా ఒకవేళ పారిస్ కమ్యూన్ తలేత్తినా, అది ప్రపంచ చరిత్ర నిర్మాణంలో భాగం అవుతుందని మార్క్స్ చెప్పడం గమనార్హం!

అదే లేఖలో ఇంకా ఇలా అంటాడు.
“పోరాడకుండా లొంగిపోయే పక్షంలో కార్మికవర్గంలో కలిగే నిస్పృహ పలువురు “నాయకుల” లొంగుబాటు కంటే ఎంతో ఎక్కువ దురదృష్టకర విషయమై వుండేది. పారిస్ లోని పోరాటం మూలంగా పెట్టుబడిదారీ వర్గానికీ, దాని రాజ్యానికి వ్యతిరేకంగా, కార్మికవర్గం చేసే పోరాటం ఒక కొత్త దశలో ప్రవేశించింది. తక్షణ పర్యవసానం ఏమైనప్పుటికీ ప్రపంచ పరివ్యాపిత ప్రాముఖ్యం కలిగిన ఒక కొత్త పుంత లభించింది”

పై వివరణ ఇచ్చిన కాలంలో ఇంకా పారిస్ కమ్యూన్ కొనసాగుతూ వుంది. అప్పుటికి అది ఏర్పడి నెల నిండింది. దాని భౌతిక ఓటమికి నలభై రోజులు ముందే కావడం గమనార్హం!

పారిస్ కమ్యూన్ ని మార్క్స్ ఇంటర్నేషనల్ సైద్దాంతిక శిశువుగా భావించాడు. దానికి వారు నిర్ధిష్ట సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా కొన్నిసార్లు కర్తవ్యోపదేశాల్ని కూడా చేశారు. కమ్యూనార్డులు వాటిని పాటించలేదు. అయినా పారిస్ కమ్యూన్ ని మార్క్స్, ఎంగెల్స్ లు స్వంతం చేసుకోవడం విశేషం!

ఎంగెల్స్ రచించిన “జర్మనీలో రైతు యుద్ధం” పుస్తకం 1870 ముద్రణకి తన “ముందుమాట” లో ఇలా అంటాడు.

“మొదట ఇంగ్లీష్ ట్రేడ్ యూనియన్లు లేకుండా, తర్వాత ఫ్రెంచి రాజకీయ పోరాటాలు లేకుండా, ముఖ్యంగా పారిస్ కమ్యూన్ అందించిన బ్రహ్మాండమైన ఊపు లేకుండా, ఈరోజు మనం ఎక్కడ వుండేవాళ్ళం?”

ఈ సందర్బంగా మరో మాట చెప్పాల్సి వుందని కూడా భావిస్తున్నా. పెట్టుబడిదారీ రాజ్య క్రూర అణచివేతకి పారిస్ కమ్యూన్ గురైనది. ఆ విషాదకర వార్తలతో మార్క్స్ మానసికంగా తల్లడిల్లాడు. ఫలితంగా మార్క్స్ ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది. ఆ విషయాన్ని గూర్చి కూడా ఉదహరిద్దాం.

మార్క్స్ శత వర్ధంతి సందర్బంగా 1983 లో నికోలై ఇవనోవ్ రచించి “సొవియట్ భూమి” ప్రచురించిన “మార్క్స్ జీవిత సంగ్రహం” పుస్తకం ఇలా పేర్కొన్నది.

“విప్లవ ప్రతీఘాత సైన్యాల దాడినీ, పారిస్ కమ్యూనార్డుల మీద తీసుకోబడ్డ అమానుష ప్రతీకార చర్యల్ని గూర్చి వార్తలు మార్క్స్ ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయి. ఆయన జబ్బున పడ్డాడు.”

అదే సందర్బంగా అదే పుస్తకంలో మార్క్స్ కుమార్తె జెన్నీ జర్మనీలో వున్న తన మిత్రులకు రాసిన లేఖలో మాటల్ని క్రింద పేర్కొంటున్నా. (మార్క్స్ సహచరి పేరు జెన్నీ, పెద్ద బిడ్డ పేరు కూడా జెన్నీ! ఇది నా వివరణ)

“మన ప్రియమైన మూర్ ప్రస్తుత పరిస్థితికి వాపోతున్నారు. ఆయన జబ్బుకు ఇదొక ముఖ్య కారణం అనుటలో సందేహం లేదు. మన స్నేహితులలో చాలా మంది పారిస్ కమ్యూన్ లో పాల్గొంటున్నారు. ఇదివరకే వారిలో కొందరిని వర్సెయల్స్ కసాయలు బలి తీసుకున్నారు.”

(మార్క్స్ నిక్ నేమ్ మూర్. ఇది నా మాట)

ఆనాటి ఫ్రాన్స్ ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు విప్లవించి నూతన రాజ్య నిర్మాణం చేసుకొని నిలదొక్కుకునే పాదార్దిక ప్రాతిపదిక లేకపోయినా, అక్కడి తిరుగుబాటు దార్లు అనుసరించిన పంథా సరైనది కాకపోయినా, స్పష్టంగా తామిచ్చిన నిర్ధిష్ట సూచనలు, సలహాలు పాటించక పోయినా, మార్క్స్, ఎంగెల్స్ అత్యంత బాధ్యత తీసుకొని స్పందించారు. నాటికీ నేటికీ ఇదో మార్గదర్శక అంశమే. నేడే పారిస్ కమ్యూన్ కి 155 ఏండ్లు! ఈ దృష్టికోణంతో మనం స్మరించుకుందాం. దాని వెలుగులో నేటి కాలంలో అవసరమైన స్ఫూర్తితో పాటు అనుసరణీయ రాజకీయ, సైద్ధాంతిక దార్శనికతని స్వీకరిద్దాం.

– పి ప్రసాద్ (పిపి)
18-3-2026

Latest News