BCCI | బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా(84) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బింద్రా మృతికి ఐసీసీ చైర్మన్ జైషాతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మృతికి ప్రగాఢ సంతాపం. ఆయన వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలిపాం. ఓం శాంతి అని జైషా ఎక్స్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ సైతం నివాళులర్పించింది.
బింద్రా 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2015లో పీసీఏ స్టేడియానికి ఐఎస్ బింద్రా స్టేడియంగా పేరు మార్చారు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన సలహాదారుగా కూడా పని చేశారు.
1987 ప్రపంచ కప్‌ను భారతదేశంలో నిర్వహించడంలో బింద్రా ప్రముఖ పాత్ర పోషించారు. 1975, 1979, 1983 ఎడిషన్‌ల తర్వాత ప్రపంచ ఈవెంట్‌ను ఇంగ్లాండ్ బయట నిర్వహించండం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. క్రికెట్ ప్రసారంలో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా బింద్రా 1994లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి వచ్చిన అనుకూల తీర్పు బింద్రా, అతని బృందం.. ఈఎస్పీఎన్, టీడబ్ల్యూఐ వంటి ప్రపంచ సంస్థలను భారత మార్కెట్ తీసుకురావడానికి సహాయపడింది. క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈవోగా హరూన్ లోర్గాట్ నియామకంలో బింద్రా కీలకపాత్ర పోషించారు. ఆయన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 2014లో రిటైయ్యారు.
