Site icon vidhaatha

Trump outsourcing tariff | ఔట్‌సోర్సింగ్‌పై టారిఫ్‌ – ట్రంప్ ఆలోచనతో ఐటీ రంగంలో కలకలం

Trump outsourcing tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ కంపెనీల ఔట్‌సోర్సింగ్ సేవలపై టారిఫ్ విధించాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు బయటకు రావడంతో టెక్ ప్రపంచంలో కలకలం రేగింది. వాషింగ్టన్ వర్గాల నుండి వచ్చిన సంకేతాల ప్రకారం, భారతదేశం నుంచి వచ్చే ఐటీ సర్వీసుల ఎగుమతులు తదుపరి లక్ష్యంగా మారే అవకాశముందని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సూచించారని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, అది భారతీయ కంపెనీలకు మాత్రమే కాకుండా అమెరికా టెక్ రంగానికే పెద్ద ప్రమాదమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అమెరికా ఐటీ రంగం విలువ దాదాపు 200 బిలియన్ డాలర్లు. 2023 నాస్కామ్ నివేదిక ప్రకారం, అమెరికాలోని ఐటీ పరిశ్రమలో 40 లక్షల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు భారతీయ నైపుణ్యంపైనే ఆధారపడి సుస్థిరతను సాధించాయి. సిలికాన్ వ్యాలీలోని సంస్థలలో 88 శాతం వరకు భారతీయ సంతతి ఇంజినీర్లు, టెక్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, శాంతను నారాయణ్​ వంటి ప్రముఖులు భారత ప్రతిభకు ప్రతీకలుగా నిలిచారు. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఔట్‌సోర్సింగ్ నిలిపివేయడం అంటే భారతీయ సంస్థలకు కన్నా అమెరికా కంపెనీలకే పెద్ద నష్టమని నిపుణుల అభిప్రాయం.

రైట్ వింగ్ కార్యకర్త లారా లూమర్ సెప్టెంబర్ 5న తన సోషల్ మీడియా పోస్టులో అమెరికా భారతీయ ఔట్‌సోర్సింగ్ సేవలను నిలిపివేస్తే ఇకపై ఐటీ కాల్స్ సమయంలో ‘ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి’ అనే అవసరం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ ప్రతినిధి జాక్ పోసో కూడా అమెరికాకు సేవలందిస్తున్న విదేశీ రిమోట్ వర్కర్లపై టారిఫ్ విధించాలని డిమాండ్ చేశారు. ఈ సంకేతాలన్నీ కలిపి చూస్తే ట్రంప్ నిజంగానే ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలు వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. “అదే జరిగితే అమెరికా కంపెనీలు కూలిపోతాయి” అని ఒకరు రాస్తే, “ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్తుంది” అని మరొకరు విమర్శించారు. “ఈ భూమిపై అతి పెద్ద మూర్ఖుడు మాత్రమే ఇలాంటి ఆలోచన చేస్తాడు” అని వ్యంగ్యంగా రాసినవారూ ఉన్నారు. కొందరు భారత స్టార్టప్ రంగానికి ఇది ప్రమాదమవుతుందని, కానీ దీర్ఘకాలంలో అమెరికా టెక్ రంగానికే పెద్ద ముప్పు అవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఈ ఆలోచన అధికారిక ప్రకటన స్థాయికి రాలేదు. కానీ నిజంగానే టారిఫ్‌లు విధిస్తే ఔట్‌సోర్సింగ్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపడం ఖాయం. భారతీయ ఐటీ రంగం తాత్కాలికంగా దెబ్బతిన్నా, దీర్ఘకాలంలో ఈ నిర్ణయం అమెరికా కంపెనీలకే చావుదెబ్బగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం ఇకపై కేవలం ఔట్‌సోర్సింగ్ హబ్ కాకుండా ప్రపంచ ఆవిష్కరణలకు డిజిటల్ పవర్ హౌస్‌గా ఎదుగుతోందని టెక్ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Exit mobile version