వారణాసి పర్యటనలో మోదీ కారుపైకి చెప్పు విసిరారా? లేక గుర్తు తెలియని వస్తువా?

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది. అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు

  • Publish Date - June 19, 2024 / 08:50 PM IST

ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదంటున్న యూపీ పోలీస్‌
వారణాసి: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి మంగళవారం వారణాసికి వచ్చిన నరేంద్రమోదీ వాహనంపై గుర్తు తెలియని వస్తువు పడటం వివాదాస్పదంగా మారింది. అది ఎవరైనా విసిరిన చెప్పు లేదా గుర్తు తెలియని వస్తువుగా భావిస్తున్నారు. కొందరు మొబైల్‌ అని చెబుతున్నారు. యూపీ పోలీసులు మాత్రం అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని వివరణ ఇస్తున్నారు. వారణాసి ఎంపీగా గెలిచిన మోదీకి గత రెండు పర్యాయాలతో పోల్చితే భారీగా మెజార్టీ తగ్గిపోయిన విషయం తెలిసిందే. మోదీ వాహనం వెళుతుండగా.. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఏదో గుర్తు తెలియని వస్తువు మోదీ ప్రయాణిస్తున్న కారుపై పడటం.. వెంటనే కారు బానెట్‌పై ఉన్న ఆయన అంగరక్షకుడు దానిని తీసి అవతలపడేయటం ఒక వీడియోలో కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ వస్తువు ఏంటనే అంశంలో చర్చ నడుస్తున్నది. భారీ భద్రత మధ్య ఉండే ప్రధాని కాన్వాయ్‌పైకి వస్తువును ఎలా విసిరారు? ఎవరు విసిరారు? అనే అంశం తేలాల్సి ఉన్నది. అయితే ఆ వీడియో సరైందేనా? అన్నది కూడా తెలియాల్సి ఉన్నది. మోదీ కాన్వాయ్‌ దశాశ్వమేధ ఘాట్‌ నుంచి కేవీ మందిర్‌కు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. 1.41 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో 19 సెకన్ల భాగంలో పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి.. చెప్పు విసిరారు.. అంటూ అరవడం వినిపిస్తున్నది. ఆ వెంటనే ఐదు లేదా ఆరు సెకన్ల వ్యవధిలో పీఎం భద్రతా సిబ్బంది తన చేత్తో దానిని పట్టుకుని పక్కకు విసిరేయడం కనిపిస్తున్నది.

అయితే.. అది చెప్పు కాదని, మొబైల్‌ ఫోన్‌ అని పేరు రాయడానికి నిరాకరించిన యూపీ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కాకపోతే మొబైల్‌ ఫోన్‌ ఎందుకు విసిరి ఉంటారన్న ప్రశ్నకు ఆయన జవాబు చెప్పలేదు. ఇది మోదీ కన్వాయ్‌లో భద్రతా లోపమా? అన్న విషయానికి కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 20వేల కోట్ల రూపాయలను 17వ విడుత కింద విడుదల చేసే కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ నిధులు 9.26 కోట్ల మంది రైతులకు ఉద్దేశించారు. మోదీకి వారణాసిలో 2019 ఎన్నికల్లో 4.8 లక్షల మెజార్టీ రాగా.. 2024 ఎన్నికల్లో 1,52,513 మెజార్టీ మాత్రమే లభించింది. మోదీ వాహనంపైకి ఒక వస్తువు పడటం అనేది ఇదే మొదటిసారి. గతంలో మోదీ పాల్గొన్న కొన్ని కార్యక్రమాల్లో ఆయన వ్యతిరేకులు నల్ల దుస్తులు ధరించి నిరసనలకు ప్రయత్నించినా.. భద్రతా సిబ్బంది వారిని అనుమతించలేదు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది చిన్న, పెద్ద నాయకులపైకి కొందరు నిరసనకారులు ఏదో ఒక వస్తువును లేదా చెప్పులను విసిరివేయడం గతంలో చోటు చేసుకున్నదే. ఇటీవల బ్రిటన్‌లో రైట్‌వింగ్‌ నేత నిగెల్‌ ఫరాగ్‌ పై పలు సందర్భాల్లో వస్తువులను విసిరేశారు. అంతకు ముందు 2008లో ముంతధార్‌ అల్‌ జైదీ అనే ఇరాకీ జర్నలిస్టు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌పై బూటు విసిరాడు. అయితే.. బుష్‌ ఆ బూటు తనపై పడకుండా తప్పించుకున్నారు. భారతదేశంలో కూడా ఇటువంటి ఘటనలు ఉన్నాయి. ఆప్‌ నాయకుడిగా తదుపరికాలంలో మారిన జర్నలిస్టు దివంగత జర్నైల్‌ సింగ్‌ అప్పటి హోం మంత్రి చిదంబరంపై షూ విసిరాడు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు నుంచి జగదీశ్‌ టైట్లర్‌ను సీబీఐ విముక్తి చేయడానికి నిరసనగా ఆయన జర్నైల్‌సింగ్‌ ఈ చర్యకు పాల్పడ్డాడు.

Latest News