- రూ.8 కోట్ల విలువ చేసే భూమి..
- కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే పని పూర్తి
విధాత, హైదరాబాద్:
GHMC NOC | హైదరాబాద్‌లోని హైదర్‌గూడ కేఫ్ బహార్ సమీపంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వీసీ) జారీ చేసింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి భార్య డాక్టర్ రాజా బన్సీ దేవీకి ఉమ్మడి రాష్ట్రంలో కేఫ్ బహార్ సమీపంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 571 (అస్సైన్ మెంట్స్.1, తేదీ 14.09.2012) పేరుతో ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటాయించిన భూమికి మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెక్కలొచ్చాయి. 16 సంవత్సరాల నుంచి ఈ భూమి విషయం పెండింగ్‌లో ఉండగా.. తాజాగా జీహెచ్ఎంసీ మోక్షం కల్పించింది.
జనవరి 29వ తేదీన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చిట్ట చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాతే జీహెచ్ఎంసీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ముక్కలు చేశారు. ఈ సమావేశంలో తమకు సంబంధించిన పనులను కాంగ్రెస్ పెద్దలు చక్కబెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కేఫ్ బహార్ సమీపంలోని డాక్టర్ రాజా బన్సీ దేవీకి చెందిన 233.23 చదరపు గజాల భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేశారని అంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బన్సీదేవీ స్వయాన వదిన.
కమీషన్లు ఇస్తే తప్ప ఆర్థిక శాఖలో పనులు కావడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు బహిరంగంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ, తమ లాంటి వారికి పెండింగ్ బాకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పేషీలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలి నుంచి అనుమతి ఉంటే తప్ప వెళ్లలేని దుస్థితి కల్పించారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఏ ప్రభుత్వంలో లేని విధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారని, పోలీసు రాజ్యం నడుస్తోందని తిట్టిపోస్తున్నారు. అన్న మల్లు రవి, తమ్ముడు మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని రిటైర్డు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
