Election Commission of India | విశ్వసనీయ కోల్పోతున్న ఎన్నికల సంఘం..

ఒకప్పుడు భారత ఎన్నికల సంఘం అంటే చాలాగొప్ప. టీఎన్‌ శేషన్‌ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజ్యాంగ సంస్థ. కానీ.. ఇప్పుడు విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రత్యేకించి కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ.. ఓట్‌ చోరీపై వరుసగా పేల్చుతున్న బాంబులతో సతమతమవుతున్నది.

ఒకప్పుడు భారత ఎన్నికల సంఘం అంటే చాలాగొప్ప. టీఎన్‌ శేషన్‌ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజ్యాంగ సంస్థ. కానీ.. ఇప్పుడు విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రత్యేకించి కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ.. ఓట్‌ చోరీపై వరుసగా పేల్చుతున్న బాంబులతో సతమతమవుతున్నది. ఖండించడానికి మాటలు లేక.. ఎదురుదాడితో సరిపెడుతున్నది. పెద్ద సంఖ్యలో డూప్లికేట్‌ ఓటర్లు, చిన్న చిన్న ఇళ్లల్లో వందల కొద్దీ నమోదైన ఓటర్ల వివరాలపై రాహుల్‌ గాంధీ చేస్తున్న విమర్శలకు దీటైన కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నది. మొత్తంగా ప్రజల్లో మాత్రం ఒక అనుమానం నెలకొన్నది. అది.. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదా?

రాహుల్‌ గాంధీ గతంలో బెంగళూరు సౌత్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటరు జాబితాలో అవకతవకలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తదుపరి మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు బయటపెట్టారు. తాజాగా హర్యానా అంశాన్ని ముందుకు తెచ్చారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఎన్నికల కమిషన్‌ స్పందనలు దాని స్థాయికి తగినట్టుగా లేవన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాణం చేసి అఫిడవిట్‌ సమర్పించాలని, మన ఇంటి తల్లులు, చెల్లెళ్ల వీడియోలు బయటపెట్టాలా? అంటూ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ చేసిన వ్యాఖ్యలు పసలేనివిగా తేలిపోయాయి. కనీసం అవకతవకలపై విచారణ జరిపిస్తామన్న ప్రకటనలు కూడా లేకపోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుపట్టాయి.

నిజానికి గతంలో కూడా ఓట్లు గల్లంతైన వివాదాలు, దొంగ ఓట్ల ఆరోపణలు ఉండేవి. కానీ.. ఇటీవలి కాలంలో ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైనా, ఈవీఎంల పనితీరుపై విమర్శలు వచ్చినా, ఓటరు జాబితా డాటాబేస్‌లో అవకతవకలు ఉన్నా.. ఎన్నికల సంఘం మొక్కుబడిగా ప్రకటనలు చేయడం లేదంటే అంతర్గత భద్రత సాకులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓట్‌ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నది. దాదాపు 25 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని పేర్కొంటున్నది. వీటిలో 5.2 లక్షల డూప్లికేట్‌ ఓటర్లు, 93 వేలకు పైగ అడ్రస్‌ లేని ఓటర్లు, ఒకే ఇల్లు లేదా నివాస ప్రదేశం నుంచి పెద్ద సంఖ్యలో నమోదైన 19.26 లక్షల ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ అవకతవకలపై స్వతంత్ర విచారణకోసం తాము పట్టుబడతామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్నది. మరోవైపు బీజేపీ, ఎన్నికల సంఘం మాత్రం ఇవన్నీ ఆధార రహితాలని కొట్టిపారేస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎన్నికల కమిషన్‌ వద్ద ‘అంతర్గత విచారణ చేస్తున్నాం’ అనే సమాధానమే వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొటున్నారు.

ఏది ఏమైనా.. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందనే విషయంలో ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎంత నిష్ఫక్షపాతంగా ఉంటే.. ప్రజల్లో దానిపై అంతటి విశ్వసనీయత ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కానీ.. విమర్శలు వచ్చినప్పుడు కీలక అంశాలను దాట వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయని అంటున్నారు.

నిజానికి ఎన్నికల కమిషన్‌లో కమిషనర్లను నియమించే విషయంలో బీజేపీ ప్రభుత్వం అవలంబించిన చర్యే దాని విశ్వసనీయతకు తొలి గొడ్డలిపెట్టుగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్న కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు చెబితే.. దానిని తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అందులోంచి తొలగించి.. హోం మంత్రిని చేర్చింది. దీంతో నిర్ణయాలు ఏకపక్షమయ్యే పరిస్థితి నెలకొన్నది.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ వై ఖురేషీ.. ఈవీఎంలు, ఓటర్‌ డాటా, ఎన్నికల ఫిర్యాదులపై పర్యవేక్షించే స్వతంత్ర సాంకేతిక కమిటీ అవసరమని పదేపదే సూచిస్తున్నారు.
న్యాయ నిపుణులు కూడా స్పష్టమైన అప్పీల్‌ విధానం లేకపోవడాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసినా.. దాని నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. ఆ విచారణలు కూడా తీవ్ర జాప్యం అవుతున్నాయి.

ఎన్నికల కమిషన్‌ యంత్రాంగం, ఈవీఎంల యాదృచ్ఛిక తనిఖీలు, సిబ్బంది కేటాయింపు వంటి విధానాలు బలంగా ఉన్నా.. వాటిపై స్వతంత్ర పర్యవేక్షణ, పూర్తి సమాచారం బహిర్గతం చేసే అవకాశం లేకపోవడం దాని విశ్వసనీయతను సవాలు చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఓట్‌ చోరీ ఆరోపణలు మళ్లీ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు దారుల మధ్య నిలబడిందని, ఒకటి.. అంతర్గత విచారణపై ఆధారపడటం.. రెండోది ప్రజా పర్యవేక్షణకు తలుపులు తెరవడం. ఈ రెండింటిలో ఒక మార్గాన్ని ఎన్నికల సంఘం అనుసరించాల్సి ఉంటుంది.