విధాత: భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఇండియా ఎలక్ట్రానిక్స్ మిషన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో, లండన్ , తెలంగాణకు చెందిన కైలాస్ ఫ్యామిలీ నేతృత్వం వహిస్తున్న అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (Akshat Greentech Private Limited), రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఒక కీలకమైన ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ ఒప్పందం ద్వారా అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ, సుమారు ₹2,500 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఈ మొత్తాన్ని ‘భారతదేశ ఎలక్ట్రానిక్స్ అండ్ కాంపోనెంట్ తయారీ పథకం (India Electronics and component Manufacturing scheme)’ నిబంధనల ప్రకారం, దశలవారీగా ఖర్చు చేయనున్నారు.
అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ ప్రధానంగా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీపై దృష్టి పెడుతుంది. ఇందులో ముఖ్యంగా మల్టీలేయర్ పీసీబీలు (Multilayer PCB), కాపర్ క్లాడ్ లామినేట్‌లు (CCL), సెన్సార్లు, యాంటెనాలు, ట్రాన్స్‌డ్యూసర్‌లు వంటి అధునాతన ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ భారీ పెట్టుబడితో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో హై-ఎండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌ల తయారీలో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది.
