విధాత, ప్రత్యేక ప్రతినిధి:
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు. బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ఇంతకాలం తనకి సహకరించిన ఆ పార్టీ పెద్దలకు, నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకు తిరిగి ఇంటి పార్టీ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆరూరి రమేష్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. త్వరలో తన అనుచరులు నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి తన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు రమేష్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ వర్ధన్నపేట నుంచి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడవ పర్యాయం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆరూరి రమేష్ బీజేపీ లోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా కూడా రమేష్ హడావిడి చేశారు. ఈ కొద్ది కాలంలోనే ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో మునిసిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
