Site icon vidhaatha

AP రాజ్యసభ.. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ

విధాత: ఏపీలోరాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన పాక వెంకట సత్యనారాయణను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న పాక వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం కౌన్సిలర్ గా పనిచేశారు. పాక వెంకట సత్యనారాయణ కూటమి రాజ్యసభ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తొలుత తమిళనాడుకు చెందిన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీలలో ఒకరికి ఈ స్థానాన్ని కేటాయిస్తారన్న ప్రచారం వినిపించింది. చివరకు ఏపీకి చెందిన బీజేపీ నేతకే రాజ్యసభ సీటు ఖరారు కావడం విశేషం.

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీయైన ఈ స్థానానికి మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన.. మే 2న నామినేషన్ల ఉపసంహరణ, మే 9న ఎన్నిక నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4 ఓటింగ్ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5 గంటలకి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఏకగ్రీవంగా అభ్యర్థి ఎన్నిక ఉండబోతుంది.

Exit mobile version