డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు వీలునామా అవసరమా?

డీ మ్యాట్ , ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించి చనిపోతే ఆ ఖాతాలను వారసులు ఆపరేట్ చేయవచ్చా? ఈ ఖాతాల్లోని డబ్బులు లేదా షేర్లను క్లైయిమ్ చేసుకోవచ్చా? వీలునామా రాయకపోతే వారసులు ఈ ఖాతాలపై చట్టబద్దంగా హక్కులను ఎలా పొందుతారో తెలుసుకుందాం.

డీ మ్యాట్ , ట్రేడింగ్ ఖాతాలను ప్రారంభించి చనిపోతే ఆ ఖాతాలను వారసులు ఆపరేట్ చేయవచ్చా? ఈ ఖాతాల్లోని డబ్బులు లేదా షేర్లను క్లైయిమ్ చేసుకోవచ్చా? వీలునామా రాయకపోతే వారసులు ఈ ఖాతాలపై చట్టబద్దంగా హక్కులను ఎలా పొందుతారో తెలుసుకుందాం.

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలపై వారసులు దక్కాలంటే వీలునామా అవసరమా?

చాలా మంది డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తారు. అయితే ఈ ఖాతాలు ప్రారంభించిన వారు అనారోగ్య కారణాలతోనో, ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ ఖాతాలను చట్టబద్దమైన వారసులు ఆపరేట్ చేయవచ్చు. కానీ, దీనికి కొన్ని పద్దతులున్నాయి. ఈ ఖాతాలను ప్రారంభించిన సమయంలో నామినీ పేర్లు నమోదు చేస్తారు. ఈ ఖాతాలు ప్రారంభించిన సమయంలో నామినీగా ఉన్న వారు ఈ ఖాతాలను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. చనిపోయిన వ్యక్తి వీలునామా రాస్తే ఇబ్బంది లేదు. ఈ వీలునామా ప్రకారంగా ఈ ఖాతాల్లోని షేర్లు, ఇతరత్రా బదిలీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి చట్టబద్దమైన గుర్తింపు కార్డులను వారసులు చూపాలి. ఒకవేళ వీలునామా రాయకపోతే నామినీ ఈ ఖాతాలకు సంరక్షకుడిగా వ్యవహరిస్తారు. చట్టబద్దమైన వారసులకు ఈ ఖాతాల్లోని షేర్లను సమానంగా పంపిణీ చేయాలి. నామినీ ఉన్నప్పటికీ చట్టపరమైన వారసులు నామినీ హక్కును సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయంలోనే ఈ వివాదాలు పరిష్కారం కావాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

నామినీ లేకపోతే?

డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతాకు నామినీ లేకపోతే ఏం చేయాలనే ప్రశ్న కూడా రావచ్చు. అప్పుడు ఈ ఖాతా ఓపెన్ చేసిన వ్యక్తికి చట్టబద్దమైన వారసులుగా తెలిపే సర్టిఫికెట్ సమర్పించాలి. కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ లేదా చట్టబద్దమైన వారసులుగా తెలిపే సర్టిఫికెట్ ను ఇవ్వాలి. లేదా ఈ ఖాతాలను ఆపరేట్ చేసే బ్యాంకులు లేదా సంస్థలు కోరిన ఇతర డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే వాటిని ఇవ్వాలి. చనిపోయిన వ్యక్తి ఖాతాల్లో కొన్ని షేర్లున్నా…. ఎక్కువ షేర్లున్నా అన్నింటికి ప్రొసీజర్ ఉంటుంది. అందుకే డిపాజిటర్లు లేదా ఈ ఖాతాలు ప్రారంభించిన వారు తప్పనిసరిగా నామినీ పేర్లను నమోదు చేయాలని సెబీ కోరుతోంది.

వారసత్వ చట్టం మేరకు

వీలునామా లేకుండా మరణించిన వ్యక్తి డీమ్యాట్ ఖాతా హిందూ వారసత్వ చట్టం (హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు) లేదా ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తిగత చట్టాల పరిధిలోకి వస్తుంది. వారసత్వ చట్టాల ప్రకారం మీ చట్టపరమైన వారసుల మధ్య వాటాలు విభజిస్తారు. ఉదాహరణకు జీవిత భాగస్వామి, పిల్లలు సమానంగా వారసత్వంగా పొందుతారు. వీలునామా లేకుండా ఎవరికి ఏమి వస్తుందో నిరూపించడానికి సమయం పడుతుంది. నామినీ తాత్కాలిక హోల్డర్‌గా మాత్రమే వ్యవహరించవచ్చు. నామినీ పేరును ఈ ఖాతాల్లో నమోదు చేస్తే ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాదు వీలునామా కూడా ముఖ్యమేనని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.