విధాత: ఆవుపేడతో తరగతి గదులు చల్లగా ఉంటాయంటూ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల తరగతి గోడలకు ఆవుపేడ పూయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి కాలేజీలో సి బ్లాక్ లో తరగతి గదుల్లో ఎండ వేడి తగ్గించేందుకు ఈ ప్రయోగం చేశారు. తను కూడా స్వయంగా గోడలకు పేడ పూశారు.
ఆవు పేడ గోడలకు రాయడం మూఢ నమ్మకానికి సంబంధించినది కాదని అన్నారు. ఇది శాస్త్రీయ పరిశోధనలో ఒక భాగం అని.. తమ అధ్యాపకుల్లో ఒకరు ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు. సాంప్రదాయ భారతీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉష్ణ ఒత్తిడి నియంత్రణను అధ్యయనం చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు ప్రత్యూష వత్సల. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ప్రిన్సిపాల్ తీరును తప్పుబట్టిన విద్యార్ధి సంఘాలు ప్రిన్సిపాల్ మేడం రూమ్ చల్లగా ఉండాలని ఆమె గదికి కూడా పేడ పూశారు, పిడకలు కొట్టారు. డీయూఎస్ యూ అధ్యక్షుడు రోనక్ ఖత్రి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రిన్సిపాల్ రూమ్ లో గోడలకు పేడ పూశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కు, విద్యార్ధులకు మధ్య వివాదం జరిగింది. తరగతి గదుల్లో చల్లదనం కోసం ఆవు పేడ పూసిన ప్రిన్సిపాల్ తన గదిలో మాత్రం ఏసీ ఎందుకు వాడుతుందంటూ వాగ్వివాదానికి దిగారు. దెబ్బకు ప్రిన్సిపాల్ మేడం ఆవుపేడ ప్రయోగం అటకెక్కినట్లేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
#Delhi తరగతి గదిలో ఆవుపేడ పూసిందని.. ప్రిన్సిపాల్ రూంలో పిడకలు కొట్టారు pic.twitter.com/mtMBv0qONQ
— srk (@srk9484) April 16, 2025