విధాత, హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ వెయ్యి ఏళ్లయినా అధికారంలోకి రాదని.. కేసీఆర్ రిటరైపోయి ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటే మంచిదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (KomatiReddy Raja Gopal Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలో ఉండి తనను మునుగోడు ఉప ఎన్నికలో ఓడించేందుకు ఫోన్ ట్యాపింగ్ తో తమ డబ్బులు పట్టుకుని, తన కోసం పనిచేసే వారిపై బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. వంద మంది ఎమ్మెల్యేలను దించి అష్టదిగ్భంధం చేసి అధర్మం పోరాటం చేశారని.. అందుకే కేసీఆర్ అధికారం కోల్పోయడన్నారు.
2018లో తనపై నమ్మకంతో మునుగోడు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని..ఆ సమయంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడంతో కేసీఆర్ తమ గొంతు నొక్కేశాడని ఆరోపించాడు. అయినప్పటికీ అసెంబ్లీలో మునుగోడు నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించానని చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో అదే కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇక్కడి ప్రజల కాళ్ల వద్దకు తీసుకొచ్చానని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్బీనగర్‌లో పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం చెప్పినా.. మంత్రి పదవిని కూడా పక్కనపెట్టి తనను ఆదరించిన మునుగోడు ప్రజలపై ప్రేమతో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచానన్నారు.
తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదని.. కానీ మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని..అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మకంతో తనను గెలిపించారని.. అందుకే ప్రభుత్వం నుంచి సహకారం అవసరమన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. శివన్నగూడెం, ఉదయసముద్రం, మూసీ ఇరిగేషన్ పనులన్ని పూర్తి చేయిస్తానని..రోడ్లన్ని అభివృద్ధి చేయిస్తున్నానని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి రాజగోపాల్ రెడ్డి.