Site icon vidhaatha

Mahakumbh 2025: కుంభమేళా తొక్కిసలాట.. 15 మంది మృతి

ప్రయాగ్‌రాజ్‌-మహాకుంభ మేళాలో బుధవారం తొక్కిసలాట జరిగి సుమారు 15 మంది మరణించారు. గంగా యమున పవిత్ర సంగమ ఘాట్‌వద్ద ఈ ఘటన జరిగింది. మౌని అమావాస్య అమృతస్నానంకోసం మునుపెన్నడూ లేని రీతిలో భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగింది. వందలాది మంది గాయపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా భక్తులు ముందుకు తోసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇది పవిత్రమైన రోజని, ఈ రోజు స్నానమాచరిస్తే మంచిదని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.

ఒక్కరోజే పది కోట్లమంది వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. అయినా తగినంత జాగ్రత్తలు తీసుకోలేదని తొక్కిసలాట ఘటన తెలియజేస్తుంది. ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టే సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. తొక్కిసలాటలో ఇప్పటివరకు పదిహేను మంది మరణించినట్టు ఎఎఫ్‌పీ తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. పవిత్ర సంగమ ఘాట్‌ వైపు రావద్దని సమీపంలోని ఘాట్‌లలోనే స్నానాలు చేయాలని నిర్వాహకులు భక్తులను కోరుతున్నారు. మంగళవారం నాడు బాగపట్‌లో జరిగిన మరో ఆధ్యాత్మిక ఘటనలో వెదురుతోవేసిన వేదిక కూలి ఐదుగురు మరణించారు. జైన మతస్థులు నిర్వహించిన లడ్డూ మహోత్సవంలో ఈ విషాద ఘటనజరిగింది.

1954 ఫిబ్రవరి- స్వాతంత్ర్య భారతంలో జరిగిన తొలి కుంభమేళాలో 800 మంది మరణించారు.
1986- ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 46 మంది మరణించారు.
2003- నాసిక్‌ కుంభమేళాలో 40 మంది మరణించారు.
2013- మహాకుంభమేళాలో నది మెట్లపై తోపులాట జరిగి 30 మంది మరణించారు.

Exit mobile version