Cabinet Reshuffle | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరోసారి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శాఖల కేటాయింపు, శాఖల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. మరోవైపు కీలకమైన హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. దీంతో ఈ శాఖలను ఎవరికి కేటాయించబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. హోంశాఖను సీనియర్ మంత్రులకు కేటాయిస్తారన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం.
శాఖల్లో భారీ మార్పులు..
మరోవైపు ప్రస్తుతం ఉన్న శాఖల్లో భారీగా మార్పులు, చేర్పులు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. కొందరు మంత్రులకు సంబంధించిన పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ హైకమాండ్ కు నివేదించిదట. ఈ నేపథ్యంలో ఎవరి శాఖల్లో కోత విధించబోతున్నారు.. ఏ మంత్రి శాఖ మారబోతున్నది అన్న చర్చ జరుగుతున్నది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపిన విషయం తెలిసిందే. పీ సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవులను ఆశించారు. అయితే వారికి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తిలో కూరుకుపోయారు. బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. దీంతో తాజాగా మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేపట్టి మిగిలిన మూడు పదవులు కూడా భర్తీ చేయబోతున్నారని సమాచారం.
సామాజికసమీకరణాలే కీలకం..
కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక సమీకరణాలనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాదిగ, ముదిరాజ్, మాల సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మిగిలిన మూడు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ సాగుతున్నది. ఈ పదవుల్లో ఒకటి మైనార్టీకి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. శాఖల్లో ఏయే మార్పులు ఉండబోతున్నాయి.. కొత్తగా ఎవరికైనా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందా? అన్నది తేలాల్సి ఉంది.