Revanth Reddy Warning To Telangana Officials : ప‌థ‌కాల అమ‌లు, అభివృద్ధి ప‌నుల‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను హెచ్చరించారు. పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనుల పురోగతిపై ప్రతి వారం నివేదికలు అందించాలని సీఎస్‌ను ఆదేశించారు.

CM Revanth Reddy strict warning to Telangana officials

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌18(విధాత‌): ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని అన్నారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని అన్నారు.

శనివారం ఉదయం సీఎం నివాసంలో సీఎంవో కార్యదర్శులు, సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని చెప్పారు.

అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు.

కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.