Telangna government: రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెట్టుబడి సాయం కింద రైతులకు ఏడాదికి 12 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని రెండు దఫాలుగా ఇస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చేది. యాసింగి సీజన్ లో 5 వేలు.. వానాకాలం 5 వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేసింది.
అయితే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకంలో రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా కేవలం రూ. 12 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకే దఫాలో మొత్తం సొమ్ము ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి రైతులకు రెండు విడతల్లో రైతు భరోసా ఇవ్వడం వల్ల ఏ సీజన్ కు ఆ సీజన్ లో రైతులు పెట్టుబడి సాయాన్ని వినియోగించుకొనేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి ఇవ్వడం వల్ల ఏ మేరకు ప్రయోజనం జరుగుతున్నదో వేచి చూడాలి. మరోవైపు ఇంకా వానాకాలం రైతు భరోసానే పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరి కొత్తగా ప్రభుత్వం ఒకేసారి రూ. 12 వేలు ఇవ్వబోతున్నదా? అన్నది వేచి చూడాలి.