- ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
chhattisgarh encounter doubts: హైదరాబాద్, మే 22(విధాత): ఛత్తీస్ గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టుల మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. నంబాల ఎన్ కౌంటర్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వయసులో ఆయన అడివిలో ఉన్నారా? లేదా తీసుకెళ్లి అక్కడ మట్టుపెట్టారా? అనే అనుమానాలు వస్తున్నాయన్నారు.
గత కొంతకాలంగా జరుగుతున్న మావోయిస్టుల, ఆదివాసీల ఎన్ కౌంటర్ల పై కూడా విచారణలో చేర్చాలని, ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన ఘటనలన్నింటిని విచారణ అంశంలో చేర్చాలని కోరారు. నిన్నటి ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమని తెలిపారు.
స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్ కౌంటర్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలన్నారు.
2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతమొందిస్తామని లక్ష్యంగా పెట్టుకుని మరి ఎన్ కౌంటర్లు చేస్తుండడం, మరోపక్క తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని సాంబశివరావు తెలిపారు.