- టార్గెట్ రేవంత్!
- సీఎం సొంత జిల్లాలోనే వ్యతిరేకత
- అవకాశం దొరికినప్పుడల్లా అసంతృప్తి
- కాంగ్రెస్‌లోకి ఎర్రశేఖర్ రాకపై అనిరుధ్ ఆగ్రహం
- పాలమూరు జిల్లాలో ఎవరికి వారేనా?
హైదరాబాద్, అక్టోబర్13 (విధాత): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన సొంత జిల్లా ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతుందా? అంటే అవుననే జరుగుతున్న పరిణామాలు.. నేతల స్టేట్ మెంట్లు తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను చేర్చుకోవాలనే ప్రతిపాదనపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో అనిరుధ్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణమైంది.
ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ప్రతిపాదనతో అనిరుధ్ అసంతృప్తి
2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎర్ర శేఖర్ కు కాంగ్రెస్ టికెట్టు దక్కలేదు. శేఖర్ కోసం అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారనే ప్రచారం సాగింది. జడ్చర్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అనిరుధ్ రెడ్డిని పక్కన పెట్టి ఎర్రశేఖర్ కు ఎలా టికెట్ ఇస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుకున్నారని కాంగ్రెస్ వర్గాల్లో అప్పట్లో ప్రచారం సాగింది.
దీంతో ఎర్ర శేఖర్ కు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. జడ్చర్ల అసెంబ్లీ టికెట్ దక్కించుకొని ఆ ఎన్నికల్లో అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగుతున్న సమయంలో అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సర్పంచ్ పదవి కోసం సోదరుడిని చంపినట్టే ఎమ్మెల్యే పదవి కోసం తనను చంపినా ఆశ్చర్యం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్ర శేఖర్ భార్య మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కోసం రంగం సిద్ధమైందనే ప్రచారం సాగుతున్న క్రమంలోనే ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ చేస్తున్నారనే ప్రచారం నెలకొంది.
వరుస వివాదాలు
అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యలు, చేష్టలతో వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్ లోని హోటల్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని ప్రచారం సాగింది. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం.
అయితే తాము రహస్యంగా కలుసుకోలేదని అనుకోకుండా కలుసుకోవడంతో కలిసి భోజనం చేశామని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు వివరణ ఇచ్చినట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఎమ్మెల్యేలు కలుసుకున్న విషయం వాస్తవమేనని అప్పట్లో అనిరుధ్ రెడ్డి మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు.
అయితే ఈ సమావేశంపై పీసీసీ అప్పట్లో ఆరా తీసింది.. ఎమ్మెల్యేలు కొందరు సమావేశం కావడం తప్పుడు సంకేతాలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత సమావేశంలో అన్నారు. సమస్యలు ఉంటే తన వద్దకు వచ్చి నేరుగా చెప్పాలని సీఎం సూచించారు.
అరబిందో ఫార్మా కంపెనీ వదిలే కాలుష్యంతో ముదిరెడ్డిపల్లె చెరువులో చేపలు చనిపోతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఎన్నిసార్లు చెప్పినా వినలేదని అరబిందో ఫార్మా కంపెనీ తీరుపై ఆయన మండిపడ్డారు. 24గంటల్లో పీసీబీ ఈ కంపెనీపై చర్య తీసుకోకపోతే తానే ఆ కంపెనీని దగ్దం చేస్తానని అనిరుధ్ వార్నింగ్ ఇచ్చారు.
దానికంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసుల లేఖలను అంగీకరించకపోతే ఆంధ్రావాళ్లను హైదరాబాద్ లో తిరగనివ్వమని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా ఇంకా ఏపీ కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక కూడా ఇంకా ఇక్కడ ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో అన్నిరకాల కాంట్రాక్టులు దక్కించుకోవడమే కాదు… దందాలు చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకునపెట్టేవిగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పాలమూరు జిల్లాలో ఎవరికి వారేనా?
పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి డీసీసీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య కూడా సమన్వయం లేదనే ప్రచారం కూడా లేకపోలేదు.
పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఫాం ఇచ్చేది లేదని డీసీసీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒక్కటిగా కొనసాగుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ, ఈ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల తీరు చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణాలు తెలుసుకొని పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.