పీసీసీ చీఫ్ రాజీ చేసినా ఆగని విమర్శలు..వీధికెక్కిన మంత్రుల విభేదాలు

మంత్రుల మధ్య రోజుకో రగడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆధిపత్య పోరు, సమన్వయం లేకపోవడం వంటి అంశాలు మంత్రుల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి. పార్టీ సమావేశాల్లోనో, సీఎం వద్దో తేల్చుకోవాల్సిన అంశాలు వీధికెక్కుతున్నాయి. విపక్షాలకు మంత్రులే ప్రచార అస్త్రాలను అందిస్తున్నారు.

హైదరాబాద్, అక్టోబర్ 12 (విధాత ప్రతినిధి) : మంత్రుల మధ్య రోజుకో రగడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆధిపత్య పోరు, సమన్వయం లేకపోవడం వంటి అంశాలు మంత్రుల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి. పార్టీ సమావేశాల్లోనో, సీఎం వద్దో తేల్చుకోవాల్సిన అంశాలు వీధికెక్కుతున్నాయి. విపక్షాలకు మంత్రులే ప్రచార అస్త్రాలను అందిస్తున్నారు. విపక్షాలు ఇంకా దూకుడుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. మంత్రుల మధ్య గొడవలను పీసీసీ నాయకత్వం పరిష్కరించినా మళ్లీ వివాదాన్ని రగిల్చే ప్రయత్నాలు చేయడంతో హస్తం పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. మంత్రుల మధ్య గొడవలు కుటుంబంలో సమస్యగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పైకి చెబుతున్నా రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తున్నాయనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి.

రచ్చకు కారణమైన లక్ష్మణ్ పై పొన్నం కామెంట్స్

హైదరాబాద్ లో ముగ్గురు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకట్ స్వామి, పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశానికి అడ్లూరి లక్ష్మణ్ ఆలస్యంగా హాజరు కావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామిపై ఆరోపణలు చేశారు. లక్ష్మణ్ సామాజిక వర్గానికి చెందిన సంఘాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. లక్ష్మణ్ ను, పొన్నం ప్రభాకర్ ను తన ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం ముగిసిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇదే వివాదంలో వివేక్ వెంకటస్వామిపై అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై తొలిసారిగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం స్పందించారు. నిజామాబాద్ లో జరిగిన మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. లక్ష్మణ్ ను రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామి అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లక్ష్మణ్ ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని ఆరోపించారు. ఈ వివాదం ముగిసినందని ప్రకటించిన తర్వాత వివేక్ వెంకటస్వామి ప్రస్తావించడంతో మళ్లీ అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రకటించారు. ఈ వివాదాన్ని ముగిసినా వివేక్ వ్యాఖ్యలతో తిరిగి ఆ అంశం తెరమీదికి వచ్చింది. పీసీసీ నాయకత్వం సమస్యను పరిష్కరించినా మంత్రులు చేసే వ్యాఖ్యలతో కొత్త సమస్యలకు అవకాశం ఏర్పడుతోంది. ఇది అధిష్టానానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య గ్యాప్ ఉండేదనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఇద్దరు మంత్రులు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. తమ మధ్య గ్యాప్ లేదని పార్టీ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారు.

పొంగులేటి, కొండా దంపతుల వివాదంపై పీసీసీకి నివేదించిన సీతక్క

వరంగల్ ఇంచార్జీ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, కొండా సురేఖ దంపతులకు మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణానికి సంబంధించి రూ. 71 కోట్లతో నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది దేవాదాయ శాఖ పరిధిలోనిది. అయితే ఈ పనులు తమకు తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వారికే ఈ పనులను అప్పగించారని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొండా దంపతులు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో పొంగులేటి జోక్యం చేసుకోవడాన్ని కొండా సురేఖ తప్పుబడుతున్నారు. ఈ విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రాకముందు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులంతా కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి సీతక్కతో మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదనే ప్రచారం గతంలో సాగింది. అయితే తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఈ ఇద్దరూ ప్రకటించారు. జిల్లాలో తమకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ వర్గం అనుమానిస్తోంది. తమ నియోజకవర్గంలో పోలీస్ అధికారుల బదిలీలతో పాటు ఇతర అంశాల్లో తమకు వ్యతిరేకంగా పొంగులేటి చక్రం తిప్పారని కొండా వర్గం భావన. తాజాగా మేడారం అంశాన్ని ఆసరాగా చేసుకొని మల్లికార్జున ఖర్గేకు కొండా దంపతులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మేడారం అంశంలో తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క ఆదివారం ప్రకటించారు. ఈ విషయాలను తాను పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ వివాదం త్వరగా సమసిపోవాలని ఆమె కోరుకున్నారు. పొంగులేటి, కొండా దంపతుల మధ్య గొడవపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

విపక్షాలకు అస్త్రాలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా గందరగోళం నెలకొంది. ఇలాంటి సమయంలో మంత్రులు పరస్పరం ఫిర్యాదులు, విమర్శలు చేసుకోవడం పరోక్షంగా విపక్షాలకు కలిసి వస్తోందని హస్తం పార్టీలో ఆందోళన నెలకొంది. సమాచారం లోపం కారణంగానో, తమ ఆధిపత్యానికి గండిపడుతోందనే కారణమో, ఇంకా ఇతరత్రా అంతర్గత సమస్యల కారణమో మంత్రులు ఫిర్యాదులు చేసుకొనే పరిస్థితి రావడం అంటే తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ అంశాలను విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొనే క్రమంలో అంతర్గతంగా మంత్రుల మధ్య నెలకొన్న నెలకొన్న విబేధాలు బయటకు వస్తున్నాయి. ఎవరికి వారు ఆధిపత్యం సాధించే క్రమంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఇది అంతిమంగా విపక్షాలకు కలిసివస్తోందనే అంశాన్ని మంత్రులు మర్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణాలతో విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు వెనుకబడ్డారనే ప్రచారం లేకపోలేదు.

అధిష్టానానికి తలనొప్పులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, నామినేటేడ్ పదవుల భర్తీ, పరిపాలన, విపక్షాల వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలతో ముందుకు సాగడంపై పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే మంత్రుల మధ్య గొడవల పరిష్కారం కోసం కాంగ్రెస్ చీఫ్ సమయం కేటాయించాల్సి రావడం కొంత ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలు లేకపోలేదు. నామినేటేడ్ పదవుల భర్తీ విషయమై జాబితా పంపాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. అయితే ఏకాభిప్రాయం కుదరక జాబితా ఇంకా అధిష్టానానికి చేరలేదు. జిల్లాల ఇంచార్జీ మంత్రులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. కానీ, పరిస్థితుల్లో మార్పులు రాలేదు. మంత్రుల మధ్య గొడవలు, అభిప్రాయబేధాలు సమాచారం లోపం వల్లే వస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పైకి చెబుతున్నారు. కానీ, ఈ పరిస్థితి రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తోందనే ఆందోళన మాత్రం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మంత్రుల మధ్య సమన్వయం కోసం పీసీసీ రంగంలోకి దిగింది.